AKSHARA KALAM
Date of Publish : 15 July 2026, 10:25 pm Posted by : AKSHARA KALAM

డిప్యూటీ సీఎం అయినప్పటికీ.. సొంత డబ్బులతోనే శస్త్రచికిత్స చేయించుకున్న పవన్

  • ప్రయాణ ఖర్చులతో సహా మొత్తం సొంత నిధులతోనే చికిత్స
  • వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ సొమ్మును వాడనంటున్న ఉప ముఖ్యమంత్రి
  • గతంలో ముక్కు ఆపరేషన్‌కు కూడా సొంతంగానే చెల్లింపులు
  • మంత్రిగా అర్హత ఉన్నా వైద్య రీయింబర్స్‌మెంట్‌ను తిరస్కరించిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత వైద్య ఖర్చుల విషయంలో తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. భుజం సర్జరీకి సంబంధించిన పూర్తి ఖర్చును ఆయన తన సొంత నిధుల నుంచే భరించారు. ఆపరేషన్‌తో పాటు ప్రయాణ ఖర్చులను కూడా ఆయనే వ్యక్తిగతంగా చూసుకున్నారు.

మంత్రివర్గ సభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ నిధుల నుంచి వైద్య ఖర్చులను రీయింబర్స్‌మెంట్ పొందే సౌకర్యం ఉంటుంది. అయినప్పటికీ, పవన్ కల్యాణ్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోలేదు. ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడకూడదన్న తన సొంత సూత్రానికి కట్టుబడి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఆయన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు కూడా పూర్తి ఖర్చును తన సొంత నిధులతోనే భరించారు. ఇప్పుడు భుజం ఆపరేషన్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఖజానాపై భారం మోపకుండా తన వ్యక్తిగత వైద్య ఖర్చులను తానే భరించడం ద్వారా పవన్ కల్యాణ్ తన మాటలకే కట్టుబడి ఉంటారని నిరూపించుకుంటున్నారు.