AKSHARA KALAM
Date of Publish : 27 October 2026, 9:26 pm Posted by : AKSHARA KALAM

మేనిఫెస్టో హామీలు ఏమైనట్టు ? 

–రేషన్ డీలర్ల తిరుగుబాటు 

— 20 నెలలుగా పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వలు

— తరుగు భారంతో కోలుకోలేని దెబ్బ తింటున్నామని వాపోయిన అసోసియేషన్

–రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చి తీరాల్సిందే

–నల్గొండలో హోరెత్తిన డీలర్ల మహా ర్యాలీ

–సమస్యల పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేసిన డీలర్లు

 

ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం

ఏళ్లకు ఏళ్లుగా పేరుకుపోయిన రేషన్ డీలర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ఇకనైనా తక్షణమే పరిష్కరించాలని రేషన్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ తెగేసి చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, నెలకు గౌరవ వేతనం, కమీషన్ పెంపు, ఉచిత రవాణా, తూకాల్లో పారదర్శకత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో డీలర్లు రణభేరి మోగించారు. స్థానిక గడియారం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లతో నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన గళాన్ని వినిపించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మోతీలాల్‌ను కలసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

​—రూ.5,000 గౌరవ వేతనం…

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రేషన్ డీలర్‌కు నెలకు రూ. 5,000 గౌరవ వేతనం చెల్లించాలి. రోజురోజుకూ పెరుగుతున్న దుకాణ నిర్వహణ ఖర్చుల దృష్ట్యా, క్వింటాలు బియ్యంపై ఇచ్చే కమీషన్‌ను రూ. 300కు పెంచి డీలర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని డీలర్లు కోరారు.

— ఏపీ తరహా విధానం..

ఫుడ్ సెక్యూరిటీ చట్టానికి అనుగుణంగా రేషన్ సరుకులను నేరుగా డీలర్ల దుకాణాల వద్దకే ఉచితంగా రవాణా చేసి అందించాలి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఈ విధానాన్ని తెలంగాణలోనూ తక్షణమే అమలు చేయాలి.

–​ఖచ్చితమైన తూకాలు…

ఎంఎల్ఎస్ పాయింట్లు/గోదాముల నుంచి దుకాణాలకు సరఫరా చేసే బియ్యాన్ని పక్కా తూకంతో ఇవ్వాలి. గత 20 నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు దుకాణాల్లోనే ఉండిపోవడంతో తరుగు పెరిగి డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు క్వింటాలుకు 10 శాతం తరుగు సడలింపు ఇవ్వాలి.

​—ప్రభుత్వానికి తుది విజ్ఞప్తి…

ప్రజా పంపిణీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో నడిపిస్తున్న డీలర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని నాయకులు కోరారు. పెండింగ్ సమస్యలు, ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే నిరహార దీక్షకు కూడా దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పారెపల్లి నాగరాజు, జిల్లా కోశాధికారి కోటగిరి సూర్యనారాయణ, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు పగిళ్ల వెంకటేశ్వర్లు, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు కొర్ల శంకర్ నాయక్, నల్గొండ డివిజన్ అధ్యక్షుడు సత్తి రెడ్డి పాల్గొన్నారు.