రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి ‘వర్షిణి’ సిద్ధం!

—అశ్వారావుపేటలో జరిగే జూనియర్ బాలికల పోటీల్లో జిల్లా ప్రాతినిధ్యం

–గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన తిప్పర్తి కిరణం

—హర్షం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయులు పి. నరసింహ నాయక్, వ్యాయామ ఉపాధ్యాయుడు లెనిన్ బాబు

 తిప్పర్తి: అక్షర కలం 

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభిస్తే వారు జాతీయ, రాష్ట్ర స్థాయిలలో సత్తా చాటుతారని తిప్పర్తి విద్యార్థిని జెర్రిపోతుల వర్షిణి మరోసారి నిరూపించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని PM SHRI ZPHS పాఠశాలలో చదువుతున్న వర్షిణి, తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది.

ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో ఆమె ప్రదర్శించిన అత్యుత్తమ రైడింగ్, డిఫెన్స్ మెళకువలు, శారీరక దార్ఢ్యం క్రీడాభిమానులను, నిర్వాహకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఆమె రాష్ట్రస్థాయి జట్టులో చోటు దక్కించుకుంది.

33 జిల్లాల క్రీడాకారుల మధ్య హోరాహోరీ పోరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంగణంలో ఈ నెల అక్టోబర్ 10 నుండి 13 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వర్షిణి పాల్గొననుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో తలపడనుండగా, మన జిల్లా తరఫున వర్షిణి ముఖ్య భూమిక పోషించనుందని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నిమ్మల లెనిన్ బాబు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే వర్షిణికి కబడ్డీపై ఉన్న ప్రత్యేక ఆసక్తి, నిరంతర సాధన ఈ స్థాయికి చేర్చాయని ఆయన కొనియాడారు.

క్రీడల్లో రాణిస్తే బాసటగా నిలుస్తాం హెచ్‌ఎం పి. నరసింహ నాయక్

వర్షిణి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. నరసింహ నాయక్ ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. వర్షిణిని పూలమాలలు, శాలువాతో ఘనంగా అభినందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ వర్షిణి తన ప్రతిభతో ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేసి, జిల్లాకు అలాగే పాఠశాలకు బంగారు పతకంతో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పాఠశాల వ్యాప్తంగా పండుగ వాతావరణం

తన ప్రతిభతో రాష్ట్రస్థాయికి ఎంపికైన వర్షిణిని సీనియర్ ఉపాధ్యాయులు దామోదర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మీయంగా అభినందించారు. వర్షిణి విజయం తోటి విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని నింపిందని, క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగేలా చేసిందని ఉపాధ్యాయులు తెలిపారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి ‘వర్షిణి’ సిద్ధం!
Comments (0)
Add Comment