అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు పూర్తి చేయాలి.

జోగులంబ గద్వాల జిల్లా అక్షర కలం ప్రతినిధి

జిల్లాలోని వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలతో పంటలు తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.

ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాదు నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలువురు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్, ఈ నెల 25 నుంచి నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (మహిళా సంక్షేమ కార్యక్రమాలు) అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పది రోజుల్లోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు వేగంగా అందేలా ట్యాబ్ ఎంట్రీలు, డేటా అప్‌డేషన్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారాల్లో కూడా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించబోమన్నారు.

స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కొనుగోలు చేయనంతగా ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని రైతుల నుంచి కొనుగోలు చేయడమే కాక వారికి రూ.45 వేల కోట్లకు పైగా డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం ద్వారా వాతావరణం కలుషితం కావడమే కాక నేల సారవంతత కోల్పోతుందని దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ నర్సింగరావు వీసీ అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులు వేచి ఉండే పరిస్థితులు ఉండకూడదన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శంకర్, డిఎస్పి మొగిలయ్య, పౌరసరఫరాల శాఖ అధికారి స్వామి కుమార్, మేనేజర్ విమల, డీఏవో వీరప్ప, డిఆర్డిఓ ముషాహిదా బేగం, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ సంఘం ప్రతినిధులు రామలింగేశ్వర్ కామ్లే, తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు చేయాలి.
Comments (0)
Add Comment