*ప్రభుత్వానికి – ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేయాలి*
*జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*
*అక్షర కలం నూతన సంవత్సరం – 2026 క్యాలెండర్ ఆవిష్కరణ*
అక్షర కలం, మంచిర్యాల జిల్లా ప్రతినిధి,
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో పత్రికల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మంగళవారం అక్షర కలం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిపిఆర్ఓ కార్యాలయంలో డిపిఆర్ఓ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ముందుగా జిల్లాలోని జర్నలిస్టులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలన్నారు.
సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే పత్రికలు సమాజానికి దిక్సూచిలా పనిచేయాలని తెలిపారు. వార్తలను ప్రచురించేటప్పుడు కేవలం సంచలనం కోసం కాకుండా, వాస్తవాలను నిర్ధారించుకుని ప్రజలకు అందించాలని సూచించారు.