–— మేకపోతుల నరేందర్ గౌడ్
అక్షరకలం నల్గొండ
బీసీల సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేకపోతుల నరేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ, విద్యా, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని నరేందర్ గౌడ్ ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, వారి హక్కులను పరిరక్షించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వాలు బీసీల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్య వైఖరిని వీడాలి. వివాదాస్పద జీవో నెంబర్ 7ను రద్దు చేసేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొండ రామకృష్ణంరాజు, రాష్ట్ర అధికార ప్రతినిది నీలం వెంకట మధు, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చొల్లేటి రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంపటి నరసింహ జిల్లా నాయకులు దొండ సాంబయ్య, ఊళ్లేoదుల అంజయ్య, డబ్బికార్ రాజా, కృష్ణ యాదవ్, కాస్ఫరాజ్ జానీ, మధు, గడ్డం మారయ్య, రేక్య నాయక్, కొత్తకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.