గోదావరి తీరంలో హై అలర్ట్
* మండల అధికార యంత్రాంగం అప్రమత్తం
* రెండో ప్రమాద హెచ్చరిక లెవెల్ దాటి ప్రవాహం
మంగపేట, ఆగస్టు 20 ( అక్షర కలం ) : మంగళవారం రాత్రి నుండి క్రమేపీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయం నుండి వేగంగా గోదావరి వరద ఉదృతి పెరగడంతో మండలంలోని అధికార యంత్రాంగం హై అలర్ట్ అయింది. బుధవారం రాత్రికి గోదావరి మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు ఉండడంతో మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు , ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టుల నుండి నీటిని దిగువ ప్రాంతానికి వదలడంతో బిల్ట్ ఇంటెక్వెల్ వద్ద, మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. బుధవారం మధ్యాహ్నం నుండి ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక లెవెల్ దాటి గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నది ప్రవాహం క్షణం క్షణం పరిశీలిస్తున్న మండల అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై టీవీఆర్. సూరి, మండల ప్రత్యేక అధికారి సిద్ధార్థ రెడ్డి, ఎంపీడీవో బద్రు నాయక్, ఎంపీఓ శ్రీనివాస్ ఐదుగురు ఒక టీం గా ఏర్పడి మండలంలోని వరద పరిస్థితిని పరిశీలిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలోని ఇండ్లలో నీరు చేరితే ఆ కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.