ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

  •  శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
    అవాంఛనీయ ఘటనలు తావులేకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాలి సీ.పీ కల్మేశ్వర్

బతుకమ్మ, నిజామాబాద్ : ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి,మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు శాంతి కమిటీ సభ్యులు,ముస్లిం మత పెద్దలు,మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో,భక్తి శ్రద్ధలతో మతసామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని,రోడ్ల మరమ్మతులు,శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం,మిలాద్-ఉన్-నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరకు కూడా విద్యుదాఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు,గోదావరి పరీవాహక ప్రాంతాల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలు,ప్రార్థనాలయాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని,ఒక్క నిజామాబాద్ నగరంలోనే ఈసారి సుమారు 750 పైచిలుకు సీ.సీ కెమెరాలు నెలకొల్పుతున్నామని అన్నారు. అయితే నిర్వాహకులు కూడా గణేష్ మండపాల వద్ద ఎవరివారు కనీసం ఒకటైన సీ.సీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు. మంటపాల వద్ద నిర్వాహకులు రాత్రి వేళల్లో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టింగ్ లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని,ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్,నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్,ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్,డిప్యూటీ మేయర్ ఇద్రీస్,అదనపు డీసీపీలు కోటేశ్వర్ రావు,బస్వారెడ్డి,ఆర్దీఓలు అంబదాస్ రాజేశ్వర్,రాజాగౌడ్,నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి,వివిధ శాఖల అధికారులు,శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Festivals should be celebrated in peaceful atmosphere
Comments (0)
Add Comment