ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

  •  సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలి
  •  టీఎస్ యుటిఎఫ్ డిమాండ్

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ. రమేష్ ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. సత్యానంద్, ఓ. రమేష్ మాట్లాడుతూ 1974 ఆగస్టు 10 న ఆవిర్భవించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది అన్నారు. యుటిఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమాన్ని శిఖరాగ్రాన నిలిపి ఐక్య ఉద్యమాలు నిర్మించి, ప్రముఖ విద్యావేత్తలు చుక్కారామయ్య, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, లక్ష్మణ్ రావు, బాలసుబ్రమణ్యం లాంటి 9 మందిని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లుగా గెలిపించుకొని ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాం అన్నారు. ఉపాధ్యాయులకు రీ గ్రూపింగ్ స్కేలు సాధించడం, అప్రెంటిస్ విధానం రద్దు, రెండు సంవత్సరాల కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించడం, 2008లో 13 రోజుల సమ్మె జయప్రదం చేయడం, 2009లో ఉపాధ్యాయులకు 32వేల పదోన్నతులు సాధించడం, 2005 నుండి సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్తో మూడుసార్లు చలో పార్లమెంట్, రాష్ట్ర స్థాయిలో పలు ధర్నాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించి సెప్టెంబర్ 1ని పెన్షన్ విగ్రహ దినంగా పాటిస్తూ నిరంతరం పోరాటం చేస్తూ వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా ఏ.పీ. లో నిరంతరం విద్యారంగ బాగు కోసం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నది అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాయాత్ర నిర్వహించి ప్రాథమిక పాఠశాలలకు తరగతి ఒక టీచర్, తరగతికి ఒక గది ఉండేటట్టుగా అభివృద్ధి చేసి, ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని డిమాండ్ చేసింది. ఫలితంగా ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించింది, కోవిడ్ సమయంలో వలస కార్మికులకు ఉపాధ్యాయుల ద్వారా విరాళాలు సేకరించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసింది, లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని తల్లిదండ్రులను సంప్రదించి సర్వే నిర్వహించి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆన్లైన్ క్లాసులను ప్రారంభించడానికి కృషి చేసింది అని తెలిపారు. పండిత, పీఈటి పోస్టుల అప్గ్రేడేషన్ సాధించి, 2010 కన్నా ముందు అపాయింట్ అయిన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇప్పించి 2023- 24 లో 25వేల ప్రమోషన్లు సాధించడం, తెలంగాణ లో మొదటి పిఆర్సి 30% ఫిట్మెంట్ తో సాధించడం, సిపిఎస్ రద్దు కోసం చేసిన నిరంతర పోరాట ఫలితంగా డెత్ గ్రాటిటి సాధించడం జరిగిందని తెలిపారు.
రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 5571 పీజీహెచ్ఎం పోస్టులు మంజూరు చేసి డి ఈ డి, బీఈడీ వారితో ఉమ్మడిగా పదోన్నతులు ఇవ్వాలని, సర్వీస్ రూల్స్ సవరణకు ముందున్న స్కూల్ అసిస్టెంట్. తెలుగు, హిందీ పండితులు, పిడి పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్ లతో సహా ఉమ్మడిగా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలనీ, బదిలీ అయిన ఎస్జిటిలను అందరినీ రిలీవ్ చేయాలనీ, గురుకుల పాఠశాలల టైం టేబుల్ ఉదయం 9 గంటలకు ప్రారంభించి సాయంత్రం 4:15 కి మార్చాలని, కేజీబీవీ యు ఆర్ ఎస్
సిబ్బందికి బేసిక్ పే చెల్లించాలని, గురుకుల, కేజీబీవీ, యుఆర్ఎస్ ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుండి విముక్తి కలిగించి బోధన వృత్తికే పరిమితం చేయాలనీ డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలనీ, ఎయిడెడ్ టీచర్స్ కి ప్రతి నెల ఒకటో తారీఖున వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, విద్యారంగానికి మరింత నిధులు పెంచి అన్ని పాఠశాలల్లో మెరుగైన భౌతిక సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డి.ఏ.లు వెంటనే ప్రకటించాలని, పిఆర్సి నివేదికను బహిర్గతపరిచి 30% ఫిట్మెంట్ కి తగ్గకుండా పి ఆర్ సి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ నిజామాబాద్ జిల్లా ట్రెజరర్ ఎమ్.మల్లేష్, జిల్లా కార్యదర్శులు జి. గంగాధర్, ఎన్.రాజారామ్, వి.సాయన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్.బాజన్న, ఎస్. భూమేశ్వర్, సోన్ పేట్ గంగాధర్,ఎల్. శంకర్, టి. కపిల్ దేవ్, ఎమ్. రవీందర్, లక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Government education should be strengthened
Comments (0)
Add Comment