అప్పు తీసుకుంటే ఆస్తి ఖతం

. జీరో వడ్డీ ఆశ చూపుతున్న వ్యాపారులు

. ముందుగానే రిజిస్ర్టేషన్లు

. సకాలంలో వడ్డీ చెల్లించకపోతే ఆస్తుల జప్తు

. అడ్డూఅదుపు లేని కాల్ మనీ దందా

. కామారెడ్డిలో వడ్డీ వ్యాపారి హత్యతో మరోసారి చర్చ  

 

జీరో వడ్డీ.. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను షేక్ చేస్తోంది. ఈ నెల 27న కొందరు వ్యక్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారీ విశ్వనాథంపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేయగా, అతడు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ 28వ తేదీన కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ దందా చేసే లక్ష్మీబాయి అవసరం నిమిత్తం వ్యాపారి విశ్వనాథం వద్ద డబ్బు అప్పుగా తీసుకొని వడ్డీతో సహా చెల్లించింది. అప్పు తీసుకున్న సమయంలో తాను విశ్వనాథానికి రిజిస్ర్టేసన్ చేసిన ఆస్తిని తిరిగి తన పేరుపై చేయడం లేదని, తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ లక్ష్మీబాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరలయ్యింది.  ఈ క్రమంలో వడ్డీ వ్యాపారి విశ్వనాథం హత్య కలకలం రేపింది. అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నవారు తాము అసలుతోపాటు వడ్డీ చెల్లించినా విశ్వనాధం తమ ఆస్తులను తిరిగి ఇవ్వకపోవడంతో దాడి చేసి మట్టుబెట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

బతుకమ్మ, నిజామాబాద్: సిరుల సీమగా పేర్కొనే ఉమ్మడి నిజామాబాద్  జిల్లాలో వ్యవసాయమే చాలా మందికి జీవనాధారం. ఒకప్పుడు రైతులు బ్యాంకులు, సొసైటీల ద్వార రుణాలు తీసుకోవడం కంటే చేబదులు తీసుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఇప్పుడు అదే వడ్డీ వ్యాపారమైంది. ఉమ్మడి జిల్లాలో రూ.2 మొదలుకొని రూ.5 వరకు వ్యాపారులు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు చెక్కులు, ప్రామిసరీ నోట్లు, జమానత్ ల ద్వార  వడ్డీ వ్యాపారం జరగగా, ఇప్పుడు జీరో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారు జీరో వడ్డీ వ్యాపారాన్ని శాసిస్తున్నారు. అవసరం నిమిత్తం అప్పుకోస వచ్చే వారి ఇండ్లు, స్థలాలు, వ్యవసాయభూములను తమ పేర్లపై రిజిస్ర్టేషన్ చేసుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారు.  తీసుకున్న అప్పు చెల్లించేందుకు వచ్చిన వారికి అసలు, వడ్డీ కలిపి ఈ ఆస్తి విలువ చేస్తుందని, తిరిగి ఇచ్చేది లేదని చెబుతున్నారు. దీంతో అప్పు తీసుకున్న వారు తెల్లముఖాలు వేయకతప్పడం లేదు.

దాడులు చేసినా ఆగని దందా

వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఈ ఏడాది జూన్ లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వడ్డీల వ్యవహారాన్ని సివిల్ మ్యాటర్ గా పోలీసులు కొట్టిపారేసి వాటిని కోర్టుల్లో తేల్చుకోవాలని సూచిస్తుండడంతో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తెలివిగా ఆస్తులను సేల్ డీడ్ చేసుకొని ఉండటంతో అప్పులు తీసుకున్న వారు ఎదురు తిరిగినా తాము నిర్ణయించిన వడ్డీ వసూలు చేసుకునే వరకు ఆస్తులను రీ రిజిస్ర్టేషన్ చేయడం లేదు. దానితో జీరో వడ్డి వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోంది. జీరో పైనాన్స్ నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.

‘రియల్’లో కిరికిరి

ఈ ఏడాది మార్చిలో డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ వడ్డీ కేసు జిల్లాలో చర్చనీయాంశమైంది. కరోనా కు ముందు నిజామాబాద్ బైపాస్ రోడ్డు వద్ద మాదవనగర్ లో కొందరు రియల్టర్లు ఓ వెంచర్ ను డెవలప్ చేశారు. తాము కొనుగోలు చేసిన భూమికి సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించేందుకు ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల వద్ద అప్పు తీసుకొచ్చారు. తీసుకువచ్చిన అప్పుకు రియలర్టర్లు వడ్డీ చెల్లించకపోవడంతో రంగంలోకి దిగిన వడ్డీ వ్యాపారులు నేరుగా రైతుల నుంచి భూమిని తమ పేర్ల మీదకు రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. అప్పటికే రియల్టర్లు ఆ వెంచర్ లో ప్లాట్లు విక్రయిస్తామని 60మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు బాధితుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయరై వడ్డి వ్యాపారులపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. కేసులు నమోదైన వడ్డీ వ్యాపారులు పెద్దల అండతో తప్పించుకోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసి తమ పేర్ల మీద రిజిస్ర్టేషన్ కాని బాధితులు ఇప్పుడు తాడో పేడో తెల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

If you take a loanyou lose the property
Comments (0)
Add Comment