* ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భముగా కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసిన…ములుగు మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి
గిరిజనులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
* ఏటూరునాగారం మరియు ములుగు మండల కేంద్రాల్లో ఆదివాసీ దినోత్సవ సంబరాలు…
* ఆధునీకరణకు ఇంకా దూరంగానే బ్రతుకుతున్న గిరిజనులు…
* గిరిజన హక్కుల సంరక్షణకై ఐకమత్యంతో పోరాడుదాం..
* ఆదివాసీల సమస్యలు పరిష్కరించడమే నా లక్ష్యం…
ములుగు జిల్లాప్రతినిధి( అక్షర కలం ) ఆగస్టు 9
ములుగు జిల్లా
ఏటూరునాగారం మండల కేంద్రాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భముగా ములుగు మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి గిరిజనులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భముగా రేగ కళ్యాణి గారు మాట్లాడుతూ ఆదివాసులు అడవితల్లి ముద్దుబిడ్డలు, ఈ సమాజానికి మూలవారసులు, భారతదేశానికి అసలు వారసులు, నీతినిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని, ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువ్ఞటద్దం ఈ ఆదివాసీలు అని అన్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో తమ మనుగడ కోసం, అస్థిత్వం కోసం అల్లాడిపోతూ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో అంతం అవుతున్నారు గిరిజనులు అని అన్నారు. క్రీ.శ 1240 నుండి 1750 వరకు ఉన్న మధ్య కాలంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా విలసిల్లిన గోండ్వాన రాజ్యాలను ఏలిన ఆదివాసులు నేడు ఈ దోపిడీ నాగరిక సమాజం పరిణామక్రమంలో తమ మనుగడ, అస్థిత్వం, జీవన విధానం విధ్వంసమై పాలకుల చేత అణచివేయబడి, గిరిజనేతర నాగరిక సమాజం చేత దోపిడీకి గురవుతూ అంతరించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వలసవాద దోపిడీకి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీలు నేడు ఈ ఆధునిక నాగరిక ప్రజాస్వామిక యుగంలో తమ జీవించే హక్కు కోసం పోరాడి అలసిసొలసి ఆవిరైపోతున్నారు అని అన్నారు. నేడు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో ఎక్కడైనా సరే ఆదివాసీలు అస్థిత్వం అంచులో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. తరతరాలుగా అడవిలో కొండలలో జంతువులతో మమేకమై వాటితో అవినాభావ సంబంధం కలిగి సహజీవనం గడిపే ఆదివాసీలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్న నేపథ్యంలో ఆదివాసులు సాంప్రదాయ పోరాటాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఆదివాసుల వారసత్వపు హక్కులు, అటవి వనరుల హక్కులకు సంబంధించిన తదితర సమస్యలపై1982 ఆగస్టు 9న జెనివాలో 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్‌ల సమావేశాన్ని నిర్వహించి ఇందులో 140 దేశాల ప్రతినిధులు పాల్గొని 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది అని అన్నారు. ఇకనుండి ఆదివాసీలు ఐకమత్యంగా ఉండి ఆదివాసీల సమస్యలను పరిష్కరించుకోవాలి అని, ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కృషి చేస్తా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ గారితో పాటుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు మరియు ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు అందరూ పాల్గొన్నారు.