నవోదయలో నంచర్ల విద్యార్థి ప్రతిభా పటిమ

—90 శాతం మార్కులతో రాష్ట్ర స్థాయి 31వ ర్యాంక్ – కష్టానికి కీర్తి

—పరిమిత వనరుల్లోనే లక్ష్య సాధన.. గ్రామానికి గర్వకారణం

మహమ్మదాబాద్, మార్చి 17. (అక్షర కలం):

మండల పరిధిలోని నంచర్ల గ్రామానికి చెందిన విద్యార్థి కొర్ర లవ్ కుశ్ నవోదయ ప్రవేశ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. 90 శాతం మార్కులతో ఓవరాల్‌గా 31వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. చిన్న గ్రామం నుంచి వచ్చిన విద్యార్థి ఈ స్థాయి ఫలితాన్ని సాధించడం స్థానికంగా హర్షాతిరేకాలను రేకెత్తిస్తోంది.

నంచర్లలోని చైతన్య విద్యా నికేతన్ సైనిక్ & నవోదయ అకాడమీలో శిక్షణ పొందిన లవ్ కుశ్, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో చదువుతూ ఈ విజయాన్ని అందుకున్నాడు. నిరంతర సాధన, పట్టుదలే తన విజయ రహస్యమని అతడు పేర్కొన్నాడు.

పేదరికాన్ని జయించిన పట్టుదల

పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన లవ్ కుశ్ తండ్రి మల్లు నాయక్. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, చదువుపై ఆసక్తిని కోల్పోకుండా కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారం అతని విజయానికి బలమైన ఆధారం అయ్యాయి.

అభినందనలు వెల్లువెత్తిన వేళ

విద్యార్థి విజయం సాధించడంతో గ్రామస్థులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అకాడమీ యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు లవ్ కుశ్‌ను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి

తమ కుమారుడు ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో అకాడమీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల కృషి ఎంతో ముఖ్యమని తల్లిదండ్రులు సంగీత, మల్లు నాయక్ పేర్కొన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామానికి ఆదర్శంగా లవ్ కుశ్

లవ్ కుశ్ సాధించిన ఈ విజయం నంచర్ల గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. గ్రామంలోని ఇతర విద్యార్థులకు ఇది ప్రేరణగా మారి మరింత మంది ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Pratibha Patima
Comments (0)
Add Comment