*వలిగొండ అక్టోబర్ 13 అక్షరకలం*:మండల పరిధిలోని ఎదుల్లగూడెం,
ప్రొద్దుటూరు గ్రామాలకు వెళ్ళే ఎదుల్లగూడెం రైల్వే అండర్ పాస్ ప్రధాన రహదారి కొద్దిపాటి వర్షానికే జలాశయంగా మారుతుంది.. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు.ఎదులగూడెం ప్రొద్దుటూరు వైపునకు వెళ్లేందుకు గతంలో రైల్వేగేట్ దాటి వెళ్లేవారు.కొన్ని సంవత్సరాల క్రితం రైల్వే అధికారులు రైల్వే గేట్ ను బంద్ చేశారు.అసంపూర్తిగా అండర్ పాస్ వంతెన నిర్మాణం పనులు చేపట్టి వాహనాల రాకపోకలు జరిగేలా చర్యలు చేపట్టారు.అండర్ పాస్ వంతెనకు కింద ప్లోరింగ్ చేపట్టక,ప్రధానంగా వర్షపునీరు నిలవకుండా,బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాటు చేయలేదు.నిర్లక్ష్యంగా నిర్మాణ పనులు చేసి వదిలేశారు. అప్పటి నుంచి చిన్నపాటి వాన కురిస్తే చాలు అండర్ పాస్ లో నీరు నిలిచిపోయి ఉండిపోతుంది.నడిచి వెళ్లేవారు,వాహనచోదకులు ఆ నీటిలో ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకుంది. మోకాళ్లలోతు నీళ్లలో గట్టెక్కితే ఆతర్వాత బురుదలో ప్రయాణం నరకంగా మారుతుంది.బురదలో వాహనాలు జారి అదుపుతప్పి కిందపడి ఎందరో ప్రమాదాలకు గురవుతున్నారు.నీటిలో నుంచి వెళ్తున్న వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండు గ్రామల ప్రజలు అధిక సంఖ్యలో రైలు పట్టాలకు ఆవతలవైపున నివసిస్తున్న ప్రజలు,నిత్యం ఈ రహదారి గుండా వారి రాకపోకలు జరుపుతుంటారు.కొన్ని సంవత్సరాలుగా రాకపోకలు జరుపుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు,పాలకులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు అండర్ పాస్ వంతెన గుండా రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది లేకుండా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లో నీరు నిలువ కుండ చూడాలని ప్రజలు కోరుతున్నారు.