కాసులు ఇచ్చిన వారికే రేషన్ షాప్ లు

  •  కామారెడ్డి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో డీలర్ల నియామకంలో చేతివాటం
  • డీలర్ షిప్ కావాలంటే లక్ష ఇవ్వాల్సిందే 
  • ఒక్క నియోజకవర్గంలో ఇద్దరు నేతల ఒత్తిడి 
  • తలలు పట్టుకున్న అధికారులు

బతుకమ్మ, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన రేషన్ డీలర్ షిప్ కేటాయింపులో చేతివాటం ప్రదర్శించిన విషయం వెలుగు చూసిందే. రెండు రోజుల క్రితం బాన్సువాడలో తహసీల్ధార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఫలితాలు బహిరంగ పర్చాలని ఆందోళన నిర్వహించిన విషయం తెల్సిందే. గురువారం కామారెడ్డి జిల్లాలో రేషన్ షాప్ ల కోసం నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఫలితాలను వెల్లడించారు. అయితే స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకే ఫలితాలు వెలువడినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రేషన్ దుకాణం కోసం లకారం వరకు చేతిచమురు విధిల్చిన వారికే షాప్ లు దక్కినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న, కొత్తగా ఏర్పాటు చేసిన రేషాన్ దుకాణాలు కేటాయింపు కోసం గతంలో దరఖాస్తులు స్వీకరించారు. రోస్టర్ రిజర్వేషన్ల ప్రకారం షాప్ లను కేటాయించినట్లు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన చేశారు. దాంతో వందల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల వారికి రాతపరీక్షను నిర్వహించారు. రాత పరీక్షకు 50 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులుగా ప్రకటించారు. కానీ ఫలితాలు వచ్చే సరికి అధికార పార్టీ లీడర్లు చెప్పిన వారికే దుకాణాలు దక్కాయని నిరుద్యోగులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో మారుమూల నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఆశవాహులు వాపోతున్నారు. ఒక్కొక్క దుకాణం కోసం లక్ష వరకు వసూల్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ దుకాణాలు దక్కాలంటే కచ్చితంగా స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధించిన వారికే రేషన్ షాప్ లు దక్కాయని పరీక్ష, ఇంటర్వ్యూ అంతా కేవలం ఫార్మలిటీ కోసమేనని వాపోతున్నారు. ప్రధానంగా ఆయా రేషన్ దుకాణాల పరిధిలో అర్హులు రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం ఉన్నప్పటికి తమ వారికే ఇప్పించుకునేందుకు నేతలు నిబంధనలు కాలరాసారని చెప్పాలి. ఇటీవల ఫలితాలు ఆలస్యం కావడం, అందులో అవకతవకలు జరుగుతున్నాయని తెలియడంతో బీజేపీ నాయకులు ధర్నాలు నిర్వహించి తహ సీల్ధార్లు, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించారు. తీరా ఫలితాలు మాత్రం అందరూ అనుకున్నట్లే హస్తవాసి ఉన్న వారికే దక్కడం విశేషం. ఇదిలా ఉండగా ఒక నియోజకవర్గంలో ఇద్దరు నేతలు తమ అనుచరులకే తాము చెప్పిన వారికే రేషన్ షాప్ లు ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో తలలు పట్టుకున్నారు. ఉన్నవి కొన్ని పోస్టులు కాగా ఇద్దరి నేతల్లో ఎవరి మాట వినలో తెలియక సతమతమైనట్లు తెలిసింది. అక్కడ రేషన్ డీలర్ల నియామకం ఎవరికి అనుకూలంగా చేసినా మరొక నేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అధికారులే తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు హైదరాబాద్ స్థాయిలోనే ప్రత్యేకంగా కొటారి చేసుకుని ఆ నియోజకవర్గంలో రేషన్ షాప్ ల కోసం వసూల్ చేయడం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేకు తెలిసి జరిగిందా లేక తానే షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నాడని ఎవ్వరు కిమ్మనకుండా దానిని బహిర్గతం చేయలేదనే టాక్ నడుస్తోంది.

Ration shops are for those who have given cash
Comments (0)
Add Comment