– పత్తి కొనుగోళ్ల కు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించాలి.
– కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణ పేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22, (అక్షర కలం వెబ్ ):
పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా చూడాలని…జిల్లాలో క్రాప్ బుకింగ్ ను వంద శాతం పూర్తి చేసి, పత్తి కొనుగోళ్లకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ,మార్కెటింగ్, హార్టికల్చర్ శాఖల అధికారుల సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కొత్త యాప్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మిల్లుల వద్ద పత్తి రైతులు నిరీక్షించే పరిస్థితి ఉండదని కలెక్టర్ తెలిపారు. గతంలో మిల్లర్లు ఎల్ 1, ఎల్ 2 ప్రకారం పత్తిని కొనుగోలు చేసే వారని, ఈ సారి ఆ విధానాన్ని రద్దు చేసి అన్ని మిల్లుల లో పత్తి కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని కలెక్టర్ చెప్పారు. ఈ సారి కౌలు రైతులు కూడా విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. అయితే కపాస్ కిసాన్ యాప్ లో రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే వారం రోజుల లోపు ఎప్పుడైనా పత్తిని మిల్లులకు తీసుకెళ్ళి విక్రయించుకోవచ్చని ఆమె తెలిపారు. జిల్లాలో ఆయిల్ ఫాం సాగు గురించి రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ ఫాం సాగు
విస్తీర్ణం పెంచేలా వ్యవసాయ,హార్టికల్చర్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆయిల్ ఫాం సాగును పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సున్నితంగా హెచ్చరించారు. జిల్లాలో ఆయిల్ ఫాం సాగు జరుగుతున్న మక్తల్, మరికల్, మాగనూరు మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ నల్లపు లింగయ్య పత్తి కొనుగోళ్ల విషయంలో గతేదాది జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేలా సంబంధిత ఎస్. ఐ లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. మార్కెట్ చైర్మన్ సదా శివారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడి జాన్ సుధాకర్, సీపీ వో యోగానంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని బాలమణి, ఆర్టీవో మేఘా గాంధీ, డీ ఎస్ వో బాల్ రాజ్, జిల్లాలోని అన్ని మండలాల ఏవోలు, ఏఈవో లు పాల్గొన్నారు.