కెనరా బ్యాంక్ సీఎస్పీ నిర్వాహకురాలి ఇల్లు వేలం

 

. మహిళా సంఘాల డబ్బులు కాజేసిందని ఇంటికి తాళం

. రూ.14.80లక్షలకు ఇంటిని దక్కించుకున్న ఓ వ్యక్తి

కోటగిరి, బతుకమ్మ: కాజేసీన డబ్బులను తిరిగి చెల్లిస్తానని చెప్పిన తేదీన చెల్లించకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు కెనార బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటికి తాళం వేసి వేలం వేశారు. ఈ ఘటన పొతంగల్ మండలం కల్లూరులో బుధవారం చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం కెనారా బ్యాంక్ సీఎస్పీ నిర్వాహకురాలు సంధ్య మహిళా సంఘాలకు సంబంధించిన రూ.45 లక్షలు స్వాహా చేసిన విషయం తెలిసిందే. మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, పెద్దల సమక్షంలో సదరు మహిళ తప్పు ఒప్పుకుని, తాను స్వాహా చేసిన డబ్బులను నెల రోజుల్లో తిరిగి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చింది. ఆ సమయంలో మహిళా సంఘాల సభ్యులు శాంతించారు. కానీ  ఇచ్చిన గడువు దాటి రెండు నెలలవుతున్నా డబ్బులు జమ చేయకపోవడంతో బుధవారం మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు కలసి సీఎస్పీ  నిర్వాహకురాలు సంధ్య ఇంటికి తాళం వేసి బహిరంగ వేలం వేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.14,80,000కు వేలంలో ఇంటిని దక్కించుకున్నాడు. సదరు మహిళ ఇది వరకు రూ.6లక్షలు జమ చేయడగా, మహిళా సంఘాల సభ్యులు మొత్తం రూ.20 లక్షల 80వేలు రికవరీ చేసుకున్నారు. మిగతా మొత్తాన్ని  త్వరలోనే రికవరీ చేస్తామని   గ్రామస్తులు తెలిపారు.

Canara Bank CSP manager's house up for auction
Comments (0)
Add Comment