–మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పూలను దైవంగా భావించి పూజించే ఏకైక సంస్కృతి తెలంగాణ సొంతమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి,సంస్కృతి వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ మన అస్తిత్వానికి,మన తెలంగాణ జీవనశైలికి నిలువుటద్దం లాంటిదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ,రంగు రంగుల పూలను పేర్చి, గౌరమ్మను కొలిచే ఈ అద్భుతమైన వేడుక మన నేల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతోందన్నారు.
పూలను బతుకమ్మ రూపంలో పూజించడం ద్వారా మన పూర్వీకులు ప్రకృతితో మమేకమైన జీవన విధానాన్ని మనకు అందించారని,ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ అంగరంగవైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

