Friday, October 30, 2026
spot_img
HomePolitical*అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలపై విమర్శలు*

*అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలపై విమర్శలు*

📰 Generate e-Paper Clip

*బిజెపి నాయకుల దిగజారుడు రాజకీయాలు*

*1న ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన సభ* 

*బిజెపి నాయకుల సవాల్ కు సిద్ధం*

*డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి*

*మందమర్రి, అక్టోబర్ 29 అక్షర కలం:*

చెన్నూరు అసెంబ్లీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బిజెపి నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని డిసిసి జిల్లా అధ్యక్షుడు పిండి రఘునాథరెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 1న ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని రాంలీల మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 300 పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ల సమన్వయంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా నుండి నిరసన సభకు హాజరవుతున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని, కాంగ్రెస్ మంత్రులు, ఎంపీ లు నిరసనలు, ధర్నాలు చేపడితే బీజేపీ నాయకులు తప్పు పట్టడం సిగ్గుచేటన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేసిన స్వర్గీయ కాకా వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించే ముందు బిజెపి నాయకులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును తొలగించాలని ఉద్దేశ్యంతోనే బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకువచ్చిందని ఆరోపించారు. స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల కమిషన్ ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. చీఫ్ ఎన్నికల కమిషనర్ (సిఇసి) ని నియమించేందుకు గతంలో సుప్రీంకోర్టు ప్రధాన మూర్తి, దేశ ప్రధాని, ప్రతిపక్ష నేత కమిటీ గా ఉండి సిఈసి నియమించడం జరిగేదని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతను ఆ కమిటీ నుండి తొలగించి, ఆ స్థానంలో కేంద్ర హోం శాఖ మంత్రిని నియమించి, సీఈసీ గా నియమించడం జరిగిందని, ఇది దురదృష్టకరమని తెలిపారు. బిజెపి అడుగులకు మడుగులోత్తే సీఈసీ ని నియమించుకునేందుకే ప్రతిపక్ష నేతను తొలగించారని ఆరోపించారు. సీఈసీ నియామకం తప్పుగా జరిగిందని, ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ పై బిజెపి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బిజెపి నేతలు చేసిన సవాలును స్వీకరిస్తూ, నవంబర్ 9 అనంతరం తొలగించిన ఓట్లు చూపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కాకా వెంకటస్వామి, ఆయన కుటుంబం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి, అభివృద్ధి చేసింది కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. అదేవిధంగా సింగరేణి సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి, ఎన్టిపిఎస్ నుండి రుణం మంజూరు చేయించి, లక్ష పదివేల ఉద్యోగాలు కాపాడారని గుర్తు చేశారు. కాకా తనయుడు ప్రస్తుత రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునః ప్రారంభించి, స్థానికులకు ఉద్యోగాలు కల్పించారన్నారు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఆయన తండ్రి కాకా వెంకటస్వామి వారసుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, కాంగ్రెస్ లో ఉంటూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ పైన పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నాయకుడు బోర్లకుంట వెంకటేష్ నేత ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారని, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలు ఆయనను గుర్తించరు అని ఆరోపించారు. ప్రస్తుత పెద్దపల్లి ఏపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. కాకా వెంకట స్వామి మనవడిగా ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపునకై పార్లమెంట్ వేదికగా తన గళాన్ని వినిపిస్తూ, పెన్షన్ పెంపునకు అవిశ్రాంతగా పోరాడుతున్నారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బొగ్గు ఉత్పత్తి మరింత వృద్ధి చెందడానికి అధికారంలో ఉన్న బిజెపితో పోరాడి రామగుండం నుండి మణుగూరు కు రైల్వే ట్రాక్ కొరకు 3600 కోట్లు మంజూరు చేయించారని, అదేవిధంగా ఇటీవల రామగిరి ఖిల్లా టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర టూరిజం శాఖతో పోరాడి 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే, బిజెపి ఎన్నికల హామీలు, వైఫల్యాలపై గళం వినిపిస్తూ, నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. జాతీయ రహదారులపై సైతం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, కేంద్రం నుండి అనుమతులు పొందుతున్నారని తెలిపారు. అటువంటి నాయకులను విమర్శించడం తగదని హితవు పలికారు. బిజెపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ అండతో శ్రీరాముని పేరు చెప్పి ఓట్లు దండుకుంటుందే తప్ప అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిజెపికి 8 మంది ఎంపీలు ఉన్నారని, గత 10 ఏండ్లగా బండి సంజయ్ ఎంపి గా కొనసాగిస్తున్నారని, వారు ఉత్తర తెలంగాణకు తీసుకువచ్చిన కేంద్ర ప్రాజెక్టులు తెలపాలని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో దేశంలో అలజడులు సృష్టిస్తూ, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరినప్పటికీ చర్యలు లేవని విమర్శించారని, ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై, తుమ్మడిహెట్టి బ్యారేజ్ ఎత్తు 148 మీటర్ల నుండి 152 మీటర్లకు పెంచేందుకు అనుమతించాలని కోరారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూరు రైతులకు నష్టం జరుగుతున్నప్పటికీ అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడలేదని విమర్శించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఎలాంటి కనీస వసతులు లేకపోయినప్పటికీ కేవలం కమిషన్ల కొరకు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ అకృత్యాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. కరువుపై కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియాలో హేళన చేస్తున్నారని, బిఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి, బడ్జెట్ ను సైతం కేటాయించిందని, బిజెపి నాయకులు కేంద్రం నుండి కరువు నివారణ చర్యలకు నిధులు కేటాయించేలా చూడాలని సూచించారు. ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, అది తమ అంతర్గత వ్యవహారమని, దానిని తాము సరిదిద్దుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, పార్టీ నేతలపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install AKSHARA KALAM App

Add to home screen for faster loading and latest updates.