—కమ్యూనిస్టు పార్టీల ఐక్యతపై ప్రజల అభిప్రాయమే ప్రధాన ప్రమాణం
–పీపుల్స్ సోషల్ జస్టిస్ ఫోరమ్ (పిఎస్ జెఎఫ్)
అక్షరకలం ప్రత్యేక ప్రతినిధి
దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం, వామపక్ష పార్టీల ఐక్యతపై మరోసారి చర్చకు అవకాశం కల్పిస్తోంది.
పీపుల్స్ సోషల్ జస్టిస్ ఫోరమ్ ( పిఎస్ జెఎఫ్ ) అభిప్రాయం ప్రకారం, రాజకీయ పార్టీల ఐక్యత అనేది కేవలం నాయకుల సమావేశాలతో లేదా పార్టీల విలీన ప్రకటనలతో ప్రజల డిమాండ్‌గా మారదు. ప్రజల జీవన సమస్యల నుంచి, వారి అనుభవాల నుంచి, వారి ఆకాంక్షల నుంచి ఒక ఐక్యతకు డిమాండ్ ఉద్భవించినప్పుడు మాత్రమే దానికి విస్తృతమైన ప్రజా ప్రాతిపదిక ఏర్పడుతుంది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన చారిత్రక ఆలోచనల్లో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ శ్రామిక వర్గ విముక్తి, సామాజిక – ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అధికారంలో ప్రజల పాత్ర వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లో కమ్యూనిస్టుల సంబంధాన్ని విస్తృత శ్రామిక వర్గ ఉద్యమంతో అనుసంధానిస్తూ వివరించారు. అదే సమయంలో, ఆ ఆలోచనలను ప్రతి దేశంలోని నిర్దిష్ట చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా ఎలా అన్వయించాలనే ప్రశ్న కూడా చారిత్రకంగా ముఖ్యమైనదే.
-ఐక్యతకు ముందు ఆత్మవిమర్శ అవసరమా ?
భారతదేశంలో కమ్యూనిస్టు రాజకీయాలపై చర్చించేటప్పుడు ఒక ముఖ్యమైన అంశం ప్రజల ముందుకు రావాల్సి ఉంది. గతంలో కమ్యూనిస్టు పార్టీలు తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ఎన్నికల వ్యూహాలు, సంస్థాగత విభేదాలు, ప్రజా ఉద్యమాలతో ఉన్న సంబంధం, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకునే విధానం వంటి అంశాలపై బహిరంగంగా ఆత్మవిమర్శ, స్వీయ సమీక్ష జరగాలా? అనే ప్రశ్నను ప్రజలే చర్చించాలి. ఐక్యత అంటే కేవలం రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల నాయకులు ఒకే వేదికపైకి రావడం మాత్రమే కాదు. ఆలోచనల ఐక్యత, కార్యక్రమాల ఐక్యత, ప్రజా సమస్యలపై కార్యాచరణ ఐక్యత, సంస్థాగత ప్రజాస్వామ్యం, నాయకత్వంపై విశ్వాసం, భవిష్యత్ పాలనా విధానంపై స్పష్టత కూడా అవసరం.
–అధికారంలోకి వస్తే ఎలా పాలిస్తారు?
ఇది ప్రజల ముందున్న అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. భారతదేశం కేవలం ఆర్థిక అసమానతలతో కూడిన సమాజం మాత్రమే కాదు. ఇక్కడ కులం, మతం, ప్రాంతం, భాష, సామాజిక వెనుకబాటుతనం, భూసంబంధాలు, నిరుద్యోగం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ, విద్య, ఆరోగ్యం, మహిళల భద్రత, దళితులు–ఆదివాసుల హక్కులు వంటి అనేక అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయి.
అందువల్ల కమ్యూనిస్టు పార్టీలు భవిష్యత్తులో అధికారంలోకి రావాలని కోరుకుంటే, కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థపై విమర్శలు చేయడం లేదా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం మాత్రమే కాకుండా భారతదేశ సామాజిక నిర్మాణాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారు?
కుల వివక్ష నిర్మూలనకు ఏ విధానం?
దళితులు, ఆదివాసులు, బలహీన వర్గాలకు ఏ విధమైన రాజకీయ – ఆర్థిక భరోసా? మత సామరస్యాన్ని ఎలా కాపాడతారు?
వ్యవసాయం, ఉపాధి, పరిశ్రమలపై విధానం ఏమిటి?
ప్రైవేటు రంగం–ప్రభుత్వ రంగం మధ్య సంబంధాన్ని ఎలా నిర్ణయిస్తారు? రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థపై వారి విధానం ఏమిటి?
ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను ఎలా రక్షిస్తారు?
అధికార వికేంద్రీకరణకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు?
అనే ప్రశ్నలకు స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన సమాధానాలను ప్రజల ముందుంచడం అవసరం.
–నాయకుల ఐక్యత కాదు – ప్రజల భాగస్వామ్యం..
పిఎస్ జెఫ్ దృష్టిలో అసలు ప్రశ్న “కమ్యూనిస్టు పార్టీలు కలవాలా? లేదా?” అనే ఒక్క ప్రశ్నకు పరిమితం కాకూడదు. కలిస్తే ఎందుకు కలుస్తున్నారు? ఎవరి కోసం కలుస్తున్నారు? కలిసిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు?” అనే ప్రశ్నలకు సమాధానాలు కూడా ప్రజలకు తెలియాలి.
ప్రజలలో చర్చ జరిగితేనే నిజమైన ప్రజాభిప్రాయం బయటకు వస్తుంది. కార్మికులు, రైతులు, దళితులు, ఆదివాసులు, మహిళలు, యువత, విద్యార్థులు, మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు — వివిధ వర్గాల అభిప్రాయాలను వినడం ద్వారా మాత్రమే ఒక రాజకీయ ప్రత్యామ్నాయం పట్ల ప్రజల అంచనాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
—పిఎస్ జెఎఫ్ సూచన…
పీపుల్స్ సోషల్ జస్టిస్ ఫోరమ్ అభిప్రాయం ఏమిటంటే, కమ్యూనిస్టు పార్టీల ఐక్యతపై చర్చను పార్టీ కార్యాలయాలకే పరిమితం చేయకుండా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. గత రాజకీయ అనుభవాలపై ఆత్మవిమర్శ, ప్రస్తుత భారత సామాజిక – ఆర్థిక పరిస్థితిపై సమగ్ర విశ్లేషణ, భవిష్యత్ పాలనా విధానంపై స్పష్టమైన కార్యక్రమం, ప్రజాస్వామ్యం–సామాజిక న్యాయం–సమానత్వంపై ఆచరణాత్మక హామీలు వంటి అంశాలపై బహిరంగ చర్చ జరగాలి.
ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలకు ఏం కావాలి?
ప్రజలు ఎలాంటి రాజకీయ మార్పును కోరుకుంటున్నారు? కమ్యూనిస్టు ఐక్యత తమ జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తున్నారు? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ చర్చకు ప్రజాస్వామ్యపరమైన అర్థం వస్తుందని పిఎస్ జెఎఫ్ భావిస్తోంది.
పార్టీల ఐక్యత ఒక రాజకీయ నిర్ణయం కావచ్చు.
కానీ దానికి ప్రజా ప్రాతిపదిక రావాలంటే ప్రజల విశ్వాసం, ప్రజల భాగస్వామ్యం, ప్రజల అభిప్రాయం అవసరం. అందుకే “కమ్యూనిస్టు పార్టీల ఐక్యతపై ముందుగా ప్రజలతో చర్చ – ఆ తరువాత రాజకీయ నిర్ణయం” అనే విధానం ప్రజాస్వామ్య చర్చకు ఒక మార్గంగా ఉండవచ్చని పీపుల్స్ సోషల్ జస్టిస్ ఫోరమ్ ( పిఎస్ జెఎఫ్ ) తన అభిప్రాయాన్ని తెలియజేస్తోందని
దర్శనం నర్సింహా ( అధ్యక్షులు — పీపుల్స్ సోషల్ జస్టిస్ ఫోరమ్ )