రోడ్డు ప్రమాదాల నివారణకు శాఖల సమన్వయం తప్పనిసరి

— జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

—బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టీకరణ

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత చర్యలను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని చెప్పారు.జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత పోర్టల్‌లో వెంటనే అప్‌లోడ్ చేయాలని, గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద తక్షణ చర్యలు తీసుకొని ప్రమాదాల నివారణకు అవసరమైన ఇంజినీరింగ్ మార్పులు చేపట్టాలని సూచించారు.జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులపై అక్రమ పార్కింగ్, రోడ్డు ఆక్రమణలు, రాత్రి వేళల్లో హెచ్చరిక లైట్లు లేకుండా నిలిపే లారీలు, ఇతర వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

రాత్రి సమయంలో నిలిపే వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, హెచ్చరిక లైట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పాఠశాలలు, బస్‌స్టాండ్లు, ఆసుపత్రులు, ప్రధాన కూడళ్లు వంటి ప్రాంతాలను ప్రత్యేక రోడ్డు భద్రత జోన్‌లుగా గుర్తించి జీబ్రా క్రాసింగ్‌లు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 ముఖ్యంగా పాఠశాలల వద్ద విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు గోల్డెన్ అవర్లో వైద్య సేవలు అందేలా అంబులెన్స్ సేవలను మరింత సమర్థంగా వినియోగించాలని, పోలీసు, రవాణా, వైద్య, రెవెన్యూ, స్థానిక సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రతి మండలంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, రవాణా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కలిసి రోడ్డు భద్రతపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే అంశాలను వెంటనే పరిష్కరించడం, అవసరమైన చోట సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలమని జిల్లా కలెక్టర్ అన్నారు.

జిల్లా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ బ్లాక్ స్పాట్స్ 

విజిట్ చేసి ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, మండల స్థాయిలో రహదారి ప్రమాదాలను తగ్గించడంలో తహసిల్దార్ మండల ఎస్ హెచ్ ఓలు సమన్వయంతో చేయాలన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా ఆక్రమణలను తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో రవాణా డిప్యూటీ కమిషనర్ వాణి, జిల్లా అధికారులు హాజరయ్యారు.

Coordination of departments is essential to prevent road accidents
Comments (0)
Add Comment