వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి

— జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

అక్షర కలం, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మే 30:

రైతు సంక్షేమంలో ప్రభుత్వం చేపట్టిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎసిసి ప్రాంతంలో గల హనుమాన్ రైస్ మిల్లును సందర్శించి ధాన్యం దిగుమతి, నిల్వ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, దాన్యం నిల్వ, తరలింపులో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశిత సమయానికి అనుగుణంగా ధాన్యం ప్రక్రియను వేగవంతం చేయాలని, లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మందమర్రి మండల కేంద్రంలోని శ్రీ వాసవి, అంబికా సాయి, సప్తగిరి రైస్ మిల్లులతో పాటు సారంగపల్లి, పొన్నారం గ్రామాలలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహశీల్దార్ సతీష్ కుమార్ తో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు, నిల్వ, ధాన్యం దిగుమతి, సిఎంఆర్ ప్రక్రియలను పరిశీలించారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని తెలిపారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేయాలని తెలిపారు. కొనుగోలు చేసి తరలించిన మొక్కజొన్నలను సైతం గోదాములలో నిలువ చేయాలని తెలిపారు. అనంతరం నస్పూర్ మండలంలో గల స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదామును మండల తహశీల్దార్ సంతోష్ కుమార్ తో కలిసి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి
Comments (0)
Add Comment