—- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
అక్షర కలం, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మే 30:
ప్రజల చేత – ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యం మన దేశంలో కొనసాగుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ నిర్వహణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, ఇతర శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టే వారిని ఎన్నుకునే శక్తివంతమైన ఓటు హక్కు ప్రజలకు కల్పించబడిందని తెలిపారు. రాజ్యాంగం దేశాల వారీగా వివిధ రకాలుగా ఉంటుందని, మన దేశంలో అమలులో ఉన్న రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉన్నామని తెలిపారు. శాసన సభ, పార్లమెంట్, సర్పంచ్, మండల పరిషత్, జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నామని, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని, సరైన నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛ, హక్కు ప్రతి ఓటరుకు ఉంటుందని తెలిపారు. ఎన్నికలలో ప్రజలకు కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికలలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. ప్రజలకు కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరు చదువుకోవాలని తెలిపారు. విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాలని, జ్ఞానం సంపాదించుకోవాలని, హక్కులు, చట్టాలు తెలుసుకోవాలని, విద్యార్థిని, విద్యార్థులు ఆత్మ రక్షణ విద్య నేర్చుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల కోసం పడుతున్న కష్టాలు తెలుసుకోవాలని, ఏకాగ్రత, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. మహిళల రక్షణ, పోషణ, స్వావలంబన, సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దేశంలో అనేక రకాల మతాలు, కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ అందరం కలిసి జీవిస్తున్నామని, మనది యువ భారత దేశమని, దేశ భవిష్యత్తు యువతదేనని అన్నారు. భౌగోళికంగా, ఆర్థికంగా మన దేశం పటిష్టంగా ఉందని, దేశ భవిష్యత్తులో విద్య అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందని తెలిపారు. అక్షరాస్యతలో మంచిర్యాల జిల్లాలో ముందంజలో ఉంచాలని, జిల్లా ప్రజల సంక్షేమం కోసం అధికార యంత్రం సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.