నల్గొండ లో “డిసిసి” పంచాయతీ.!

– “నేత” చేతికి పగ్గాలు 

— కొత్త అధ్యక్షుడి పై గుమ్మల అసంతృప్తి

—నా కులమే డీసీసీ పదవిని లాక్కుంది

–నమ్మించి గొంతు కోశారని తీవ్ర ఆవేదన 

 –కోమటిరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో కార్పొరేషన్ పదవి వస్తుందని వ్యాఖ్య

–గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ లో వలస రాజకీయ నాయకులకే పెద్ద పీఠ

–కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే వాళ్ళని రోడ్డు మీద దొరికించుకొని కొడతామని హెచ్చరిక

అక్షరకలం ప్రతినిధి, నల్గొండ 

నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం బిసి నాయకుడు పున్న కైలాస్ నేతను వరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఏఐసీసీ శనివారం రాత్రి డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసినదే. అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డికి నిరాశ ఎదురయింది. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు అయిన గుమ్మలకు పదవి దక్కుతుందని ఆశించినా.. సీనియర్ నేత జానారెడ్డి చక్రం తిప్పడంతో పున్న కైలాస్ నేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. నల్లగొండలోని మంత్రి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ప్రతిసారి డీసీసీ పదవి అడిగినా.. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు అనే పేరు, కులం తనకు అడ్డుగా వచ్చిందని తీవ్ర ఆవేదన చెందారు. కులం నా డీసీసీ పదవిని లాక్కుందని, కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా డీసీసీ కావచ్చు అన్నారు. సీనియారిటీ నా సర్వీస్ ఎందుకు పనికి రాలేదని ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కకు పెట్టారని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు 5 వేల మందితో ర్యాలీ తీశానని, మా నాన్న ఎమ్మెల్యేనో, ఎంపీనో, అయితే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చేది అంటూ వ్యాఖ్యానించారు. తాను నమ్మిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇది కాదని, .రెడ్డి కులం డీసీసీ కి అడ్డు అయితే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. పార్టీ లైన్ దాటకుండా పనిచేయడం కోమటిరెడ్డి నేర్పారని అదే పద్ధతిలో రాజకీయాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నలగొండలో సభ పెడితే తానే ముందున్నానన్నారు. భుజం మీద చేయి వేసి రేవంత్ రెడ్డి తన గొంతు కోశాడని, సీఎం దగ్గర ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి పర్యాటక కార్పోరేషన్ పదవి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఇద్దరు ఎంపీలు అయ్యారని, నియోజకవర్గ మొత్తం నా పేరు డీసీసీ కి ఓకే అన్నారని, అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డుకుంటుందని ఆరోపించారు. తన తర్వాత వచ్చిన 20 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్తానని చెప్పినా వద్దని చెప్పానన్నారు. గత రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ లో వలస రాజకీయ నాయకులకే పెద్ద పీఠ వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో నష్టం చేసే వాళ్ళని రోడ్డు మీద దొరికించుకొని కొడతామని, కోమటిరెడ్డి తలుచుకుంటే ఆర్టీసీ చైర్మన్ పదవి తనకు వస్తుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి తాను సపోర్ట్ చేయలేదని, అలా అని ఎవరిని బ్లాక్ మెయిల్ కూడా చేయలేదన్నారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నానని, దేవుడులా నమ్ముకున్న నాయకుడే న్యాయం చేస్తాడని భావిస్తున్నానన్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా జెండా వదల్లేదని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరికీ చెబుతున్నానని, పార్టీకి నష్టం చేసే వారిని వెంట తిప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. బీసీ సర్పంచుల విషయంలో పార్టీ పరంగా 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, కాంగ్రెస్ పార్టీలో ఎవరి వెంట తిరిగితే వాళ్ల బ్యాచ్ అంటున్నారని రేవంత్ రెడ్డి వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవి వచ్చేవని అన్నారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అన్నారు. ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లా పదవికి ఐదుగురు పోటీపడ్డారు. తాము పార్టీకి అందిస్తున్న సేవలను వివరిస్తూ… అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కొండంటే మల్లయ్య (ఎస్సి), పున్న కైలాస్ నేత (బి.సి), గుమ్మల మోహన్ రెడ్డి (ఓసి), చామల శీను (బిసి), ధైదా రవీందర్ (ఎస్సీ),డీ.సీ.సీ పదవి కోసం పోటీపడ్డారు. అయితే నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి కి మద్దతు ప్రకటించారు. అయితే సామాజిక సమీకరణాల దృశ్య బీసీలకే డీ.సీ.సీ అధ్యక్ష పీఠం కేటాయించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఊహించినట్లుగానే డీసీసీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ హై కమాండ్ బీసీలకు కేటాయించింది.

—పున్న కైలాస్ నేత రాజకీయ నేపథ్యం…

పున్న కైలాస్ నేత కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఓయూ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో ఆయన భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. బీ.సీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పట్ల నిబద్ధత తో ఆయన పోరాడేవారు. మునుగోడుకు చెందిన పున్న కైలాస నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా, విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు.2014 లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2018, 2023 లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

"DCC" Panchayat in Nalgonda.!
Comments (0)
Add Comment