*మహిళా వ్యవసాయ విస్తరణ అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ.
*బాలకృష్ణను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
సూర్యాపేట,ఆగస్టు,29 (అక్షర కలం) ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ తన కింది మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఒక మహిళా వ్యవసాయ విస్తరణాధికారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది.
గురువారం రాత్రి 10 గంటల సమయంలో తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ తన కింద పని చేసే తుంగతుర్తి మండలానికి చెందిన ఒక వ్యవసాయ విస్తరణ అధికారిణి తో ఫోన్ లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఖచ్చితమైన ఆధారాలతో జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ తక్షణమే తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై విచారణ నిర్వహించి వెంటనే నివేదిక సమర్పించాలని ఆయన జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు . జిల్లాలో మహిళా ఉద్యోగుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.