–-టెట్.. తప్పనిసరి
— ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్ సిటీఈ
— విడుదలైన టెట్ నోటిఫికేషన్
— నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ
–ఇన్ సర్వీస్ వాళ్లూ అర్హత సాధించాల్సిందే
–2010కి ముందు నియమితులైన వారిలో టెన్షన్
— నల్లగొండ జిల్లాలో సుమారు 4 వేల మంది టెట్ లేని ఉపాధ్యాయులు
అక్షరకలం ప్రతినిధి, నల్గొండ
టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అంశం
ఉపాధ్యాయ వర్గాల్లో మరోమారు చర్చకు దారితీసింది. సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం టెట్ అర్హత తప్పనిసరి అవనుండటంతో ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొంది.
–– సీనియర్ల భవిష్యత్ పై అనిశ్చితి…
ఇప్పటికే 20 ఏళ్లకుపైగా ఉపాధ్యాయ వృత్తిలో కొన సాగుతున్న చాలామందికి టెట్ అర్హత లేదు. దీంతో భవిష్యత్, పదోన్నతులు, బదిలీలు, వేతన ఇంక్రిమెంట్లు ప్రభావితమవుతాయన్న భయం వారిని పట్టుకుంది. నియామక సమయంలో టెట్ విధానం లేకపోయినా, ఇప్పుడు మధ్యలో మార్గదర్శకాలు మార్చడం అన్యాయం అని వారు వాదిస్తున్నారు. విద్యాశాఖ మాత్రం కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి టెట్ ప్రమాణాలను అమలుచేయక తప్పదని పేర్కొంటోంది.
–సంఘాల్లో చర్చలు…
తాజా మార్గదర్శకాలపై జిల్లా ఉపాధ్యాయ సంఘాలు చర్చలు ప్రారంభించాయి. కొందరు టెట్ పరీక్షకు సిద్ధమవుతుండగా, మరి కొందరు న్యాయపరమైన మార్గాలపై ఆలోచిస్తున్నారు. ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని అంచనా వేయడం అవసరమే అయిన, ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి ప్రత్యేక మినహాయింపు లేదా ప్రత్యామ్నాయ విధానం ఉండాలని సంఘాలు కోరుతున్నాయి. 2010కి ముందే నియమితులైన వారితోపాటు తర్వాత పదోన్నతులు పొందినవారిలోనూ అయోమయం నెలకొంది.
–—4 వేల మంది టెట్ లేనివారే..!
నల్గొండ జిల్లాలో 1127 ప్రైమరీ,128 యుపిఎస్, 229 హై స్కూల్ లు ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు రెండు లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 6500 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో స్కూల్ అసిస్టెంట్లు 3500 మంది, గెజిటెడ్ హెచ్ఎంలు 235, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 208 మంది, ఇంకా మిగతా ఇతర టీచర్లు ఉన్నారు. అయితే వీరిలో సుమారు 4000 మంది టీచర్లకు టెట్ లేదు. వీరంతా 2009 తర్వాత నియామకమైన టీచర్లు.
ఇక ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు నల్లగొండ జిల్లాలో 1000 మంది ఉన్నారు. అయితే 4 వేల మంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితి జిల్లాలో విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సీటీఈ మార్గదర్శకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. అయితే తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయవర్గాలంతా టెట్ అంశంపైనే చర్చించుకుంటున్నారు. విద్య హక్కు చట్టంలోని అర్హత నిబంధనలను ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. ఇందుకోసం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లు పెద్ద ఎత్తున దాఖలవుతున్నాయి. ఉభయ సభల ఆమోదంతో చట్టసవరణ ద్వారా పరిష్కారం సాధ్యమని నాయకులు భావిస్తున్నారు.
–టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అంటే…
విద్యాహక్కు చట్టం ప్రకారం 2010 నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అంతకముందు నియమితులైన ఉపాధ్యాయులందరూ టెట్ రాయాలి. ఎస్జీటీలు అయితే టెట్ పేపర్-1 స్కూల్ అసిస్టెంట్ అయితే పేపర్-2 రాయాలి. 30 సెప్టెంబర్ 2030 లోపు ఉద్యోగ విరమణ చేసేవారు రాయనవసరం లేదు. అయితే ఐదేళ్లలో ప్రమోషన్ పొందాలంటే టెట్ తప్పనిసరి. ఐదేళ్లకు పైగా సర్వీస్ ఉన్నవారు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలి.
—నేటి నుండి ధరకస్తుల స్వీకరణ…
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఆశించే అభ్యర్థులకు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటేట్) జనవరి 2026 నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. టెట్ పరీక్షలు ఆన్లైన్ మోడ్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటి) నిర్వహించనున్నారు. నేటి నుండి ఈనెల 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. పరీక్షలను 2026 జనవరి 3 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
—సవరణ చేయాలి….
పెరుమాళ్ళ వెంకటేశం (టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి )
విద్యాహక్కు చట్టంలోని 23వ పేరాను సవరించాలి. సీనియర్లకు మినహాయింపు ఇవ్వాలి. దశాబ్దాల కితం నియామకమై ఏళ్ల తరబడి సర్వీసున్న వున్నా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. కాలానుగుణంగా నాణ్యమైన బోధన కోసం అర్హతల్లో మార్పు ఆహ్వానించ దగ్గ విషయమే అయినా ఇదివరకే సర్వీసులో చేరిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సడలింపు ఉండాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఆలోచించి విద్య హక్కు చట్టానికి సవరణ చేయాలి.