—నేటి నుండి 30 వరకు కార్యక్రమాలు
–ఇందిరమ్మ చీరల పంపిణీ, అంగన్‌వాడీ భవనాల ప్రారంభోత్సవాలు
— స్త్రీనిధి ద్వారా రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం
— వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు మంత్రి ఆదేశం
ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 25 నుండి 30 వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఆదివారం ఆమె హైదరాబాద్ నుండి మహిళా వారోత్సవం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నదని తెలిపారు.
మహిళా వారోత్సవం సందర్భంగా వివో భవనాలు, అంగన్‌వాడీ భవనాల ప్రారంభోత్సవాలు చేపట్టాలని తెలిపారు. సెర్ప్ ద్వారా 300 మంది మహిళలకు రుణాలు అందించనున్నమని, స్త్రీనిధి ద్వారా రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని, మహిళా సంఘాలకు మరింత ఆర్థిక ప్రోత్సాహం అందించాలని అధికారులకు ఆదేశించారు.
మహిళా వారోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, మెప్మా పిడి శ్రీనివాస్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.