వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి — జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

—కేంద్రాల్లో నిల్వలు లేకుండా మిల్లులకు తరలించాలి

​—-ట్యాబ్ ఎంట్రీలు వేగవంతం చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి

​—మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వెల్లడి

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

కొనుగోలు చేసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మిల్లులకు తరలించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వ లేకుండా క్లోజ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ దాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములైన అధికారులను ఆదేశించారు. ఆదివారం 

హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలిసి ధాన్యం కొనుగోలు పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుండి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ముందే సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం రానున్న 6, 7 రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకుగాను ప్రతిరోజు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించడమే కాకుండా, సంబంధిత అధికారులతో సమీక్షించి, మిల్లుల వద్ద తక్షణమే ధాన్యం అన్లోడింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి కి తెలియజేశారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం మొత్తాన్ని వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మిల్లులకు తరలించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేయాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లర్లు వెంటనే ధాన్యాన్ని దించుకోవాలని, ఏ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు పౌరసరఫరాల శాఖ మంత్రి మంత్రి ఎన్ .ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని,

ఇంకా 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగాల్సి ఉందని, అధికారులు వెంటనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

మిల్లర్లు, ట్రేడర్లు తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.

అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ లేకుండా పూర్తిగా కొనుగోలు చేసి కొనుగోలు ప్రక్రియను ముగించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల అధికారి వెంకటేష్, డిఎం రాంపతి, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి -- జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
Comments (0)
Add Comment