ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

— కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరిక

​— సాదా బైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి 

— ఆర్‌డీఓలు, తహసీల్దారులకు ఆదేశం

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం భూములను ఎవరైనా అక్రమంగా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్‌డీఓలు, తహసీల్దారులతో సాదా బైనామా, భూభారతి, ల్యాండ్ సర్వే అంశాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు త్వరగా న్యాయం చేయాలని అన్నారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో ఎవరైనా డబ్బులు తీసుకుని పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం భూములు, ఇతర ప్రజా ప్రయోజన భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే భూభారతి సంబంధిత కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చిన సమస్యలు జిల్లా స్థాయికి రావడం సరికాదని, ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇకపై తాను డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.

అదేవిధంగా అటవీ, రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన భూముల సర్వేను వేగవంతం చేసి, భూ రికార్డులను సమగ్రంగా రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఎస్ ఐ ఆర్ లో భాగంగా డోర్ టు డోర్ బిఎల్ఓ లతో పని చేయించుకోవాలని,గురువారం జరగబోయే గ్రామ సభలో అందరు పాల్గొని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్ నాయక్, ల్యాండ్ సర్వే ఏడి ధీరజ్, ఆర్‌డీఓలు, తహసీల్దారులు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment