​సామాన్యుడి చేతిలో రాజ్యాంగ మహాస్త్రం 

​—ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ‘ఆర్టీఐ’ దిక్సూచి !

​–పది రూపాయల దరఖాస్తు… పాలనలో పారదర్శకతకు పునాది 

​అక్రమాలపై విరుచుకుపడే ఆయుధం ‘ఆర్టీఐ-2005’!!

— అక్టోబర్ 12 జాతీయ సమాచార హక్కు దినోత్సవం

అక్షరకలం ప్రత్యేక ప్రతినిధి

ప్రజాస్వామ్యంలో పౌరుడే నిజమైన రాజు అని రాజ్యాంగం చెబుతుంది. కానీ ఆచరణలో దశాబ్దాల పాటు ప్రభుత్వ కార్యాలయాల దస్త్రాలు, ప్రజాధనం ఖర్చు చేసే తీరు అత్యంత గోప్యంగా ఉంటూ వచ్చాయి. ఏ చిన్న ప్రభుత్వ పని కావాలన్నా అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడం, లంచాలు సమర్పించడం సామాన్యుడికి నిత్యకృత్యమైంది. ఈ చీకటి తెరలను బద్దలు కొడుతూ, పాలకులను, అధికారులను జవాబుదారీగా నిలబెట్టేందుకు భారత పార్లమెంట్ అందించిన మహా అస్త్రమే సమాచార హక్కు చట్టం (RTI Act, 2005). దేశవ్యాప్తంగా 12 అక్టోబర్ 2005న పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన ఈ చట్టం, నేడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలనా స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తోంది.  

—– పది రూపాయలతో ప్రశ్నల వర్షం.. పారదర్శకతకు ప్రతీక!

ఒకప్పుడు ప్రభుత్వ రికార్డులను చూసే సాహసం సామాన్యుడికి ఉండేది కాదు. కానీ నేడు కేవలం రూ. 10 దరఖాస్తు ఫీజుతో ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతుందో నిలదీసే శక్తిని ఈ చట్టం అందించింది. 

ఇక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచితంగానే

సమాచారాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా (ప్రాణాపాయం లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదైతే 48 గంటల్లో) కోరిన సమాచారాన్ని అందించాల్సిందే.  

సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే లేదా నిరాకరిస్తే, బాధ్యులైన అధికారుల జీతం నుంచి రోజుకు రూ. 250 చొప్పున జరిమానా విధించే కఠిన నిబంధన అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతోంది. 

— వెలుగులోకి అక్రమాలు…

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న బోగస్ మస్టర్ రోళ్ల బాగోతం, రేషన్ దుకాణాల్లో బియ్యం పక్కదారి పట్టడం, పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వంటి ఎన్నో అక్రమాలను సామాన్యులు, యువకులు ఈ చట్టం ద్వారానే వెలికితీశారు. దశాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని ఫైళ్ల రహస్యాలను ఆర్టీఐ బట్టబయలు చేసింది. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చేయడంలో ఈ చట్టం ఒక రక్షాకవచలా నిలుస్తోంది.  

​–ఎదురువస్తున్న సవాళ్లు – పౌరుల బాధ్యత…

చట్టం ఎంత శక్తివంతమైనదైనా, క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల అధికారుల నుంచి కావాలనే జాప్యం జరగడం, దరఖాస్తులను తిరస్కరించడం వంటి సమస్యలు ఇంకా కనిపిస్తున్నాయి. అయితే, మొదటి మరియు రెండవ అప్పీలు అధికారులను ఆశ్రయించడం ద్వారా వాటిని ఎదుర్కొనే వెసులుబాటు చట్టం కల్పించింది.  

​—సమాచారమే శక్తి…

పాలనలో పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. పాలకులను ప్రశ్నించే హక్కును సద్వినియోగం చేసుకుంటూ, బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

–—పేదవాడి చేతికి అందిన అస్త్రం....

ఓ గ్రామంలో నివసించే రామయ్య కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే సాధారణ వ్యక్తి. వాళ్ల ఊరికి ప్రభుత్వ పథకం కింద పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. కానీ, పంచాయతీ పెద్ద మనుషులు ఆ ఇళ్ల జాబితాలో రామయ్య పేరు తొలగించి, వారి బంధువులకు ఇచ్చుకున్నారు. “మాకు ఇళ్లు రాలేదంటే” అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు, కనీసం కారణం కూడా చెప్పలేదు.

​–ఆశ ఇప్పించిన అడుగు..

నిరాశలో ఉన్న రామయ్యకు ఒక యువకుడు ఆర్టీఐ (RTI) చట్టం గురించి చెప్పాడు. ఎవరి కాళ్లూ పట్టుకోకుండా, ఎవరిని వేడుకోకుండా కేవలం రూ.10 స్టాంప్ వేసి దరఖాస్తు పెట్టుకోవచ్చని వివరించాడు. రామయ్య స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్లి, “మా గ్రామానికి మంజూరైన ఇళ్ల జాబితా వివరాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రాతిపదిక ఏమిటి?” అని లిఖితపూర్వకంగా సమాచారం కోరాడు.

​–అధికారుల్లో కదలిక…

​మొదట్లో అధికారులు రామయ్యను చూసి నవ్వుకున్నారు. “ఈ కూలీ మాపై ఫిర్యాదు చేస్తాడా?” అనుకున్నారు. కానీ చట్టం ప్రకారం 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాల్సిందే. ఆ గడువు దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం ఇవ్వకపోతే పై అధికారుల నుంచి వచ్చే జరిమానాలు, శాఖాపరమైన చర్యలు వారికి గుర్తుకొచ్చాయి.–

–అందిన న్యాయం…

గడువు ముగిసేలోగా అధికారులు రామయ్య ఇంటికి స్వయంగా వచ్చి సమాచార పత్రాలు అందజేశారు. అంతేకాదు, జాబితాలో జరిగిన తప్పును సరిదిద్ది, రామయ్యకు ఇల్లు మంజూరు చేస్తున్నట్టు ఆర్డర్ కాపీని కూడా చేతిలో పెట్టారు… ఆర్టీఐ అనేది అధికారులను ప్రశ్నించడానికి, అవినీతిని అరికట్టడానికి సామాన్యుడికి రాజ్యాంగం ఇచ్చిన మహా శక్తి. ఒక్క చిన్న దరఖాస్తు వ్యవస్థనే కదిలించగలదనేదానికి ఇదే నిదర్శనం.

 

​

 

 

 

 

 

 

 

 

 

 

 

​