ఎల్ నినో పరిస్థితులపై ముందస్తు ప్రణాళికలు

— సీఎస్ సంజయ్ జాజు

​– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

— నల్గొండ జిల్లా పరిస్థితులను వివరించిన కలెక్టర్ చంద్రశేఖర్

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, ఉపాధి తదితర రంగాలలో ముందస్తుగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సీజనల్ కండిషన్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సమాచార హక్కు చట్టం అవార్డును తీసుకునెందుకు హైదరాబాద్ వెళ్ళిన జిల్లా కలెక్టర్ హైదరాబాద్ నుండి నల్గొండ జిల్లాకు సంబంధించి సీజనల్ కండిషన్స్ ను వివరిస్తూ ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం జిల్లాలో 25 మండలాలలో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉందని, 7 మండలాలలో సాధారణ వర్షపాతం ఉందని, భూగర్భ జలాలలో తగ్గుదల ఉన్నప్పటికి ప్రస్తుతానికి జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి వేయవద్దని రైతులకు ముందుగానే పూర్తిగా అవగాహన కల్పించడం జరిగిందని, వరికి బదులు ఉద్యాన పంటలైన పెసర్లు, మినుములు వంటివి సాగు చేయాలని తెలియజేశామని చెప్పారు. ఎల్ నినో ప్రభావం వ్యవసాయం, తాగునీటిపై ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మండలాలలో సమావేశాలు నిర్వహించామని, అదేవిధంగా రైతులు ,ఇతరులతో కూడా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని, డిసెంబర్ జనవరి నెలలో, కొన్ని మండలాలలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందిస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.

 వీడియో కాన్ఫెరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ సెల్ ఫోన్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

 రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్, సిపిఓ శ్రీనివాస్ నాయక్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి శేఖర్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.