ప్రారంభమైన బతుకమ్మ పండుగ

మంగపేట, అక్టోబర్ 10 ( అక్షర కలం ) : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగ వేడుకలు శనివారం ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగకు ముందు వచ్చే అమావాస్య ( మహా లయ అమావాస్య ) నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ పండుగలో భాగంగా తొలి రోజు శనివారం ఎంగిలి పూల బతుకమ్మను మండలంలోని ఆయా గ్రామాలలోని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా శనివారం ఉదయం మహిళలు పవిత్ర స్నానాలు ఆచరించి పళ్లెంలో గుమ్మడి, బీర తదితర ఆకులు పేర్చి వాటిపై ముందు రోజే కోసి నీళ్ళల్లో ఉంచిన గుమ్మడి, తంగేడు, బీర, గన్నేరు, మందార, బంతి తదితర పూలతో బతుకమ్మను తయారు చేశారు. బతుకమ్మ మధ్యలో పసుపుతో గౌరమ్మను అలంకరించారు. సాయంత్రం ఆయా గ్రామాలలోని మహిళలు తమ సమీపంలో బతుకమ్మ ఆడే ప్రదేశంకు చేరుకుని అక్కడ తోటి మహిళలతో కలిసి చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడారు. గ్రామ గ్రామానా, వీధి వీధినా మహిళలు బతుకమ్మ ఆడుతుండడంతో పల్లెలన్నీ సందడిగా మారాయి.

Leave A Reply

Your email address will not be published.