— అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి
అక్షరకలం నల్గొండ
నల్గొండ పట్టణంలోని 9వ వార్డు పరిధిలోని న్యూ సూర్యవంశీ కాలనీ (డీవీకే రోడ్) ముత్యాలమ్మ గుడి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని కాలనీ వాసులు ఆరోపించారు.
ఈ విషయమై వారు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రజల రాకపోకలకు వినియోగంలో ఉన్న రోడ్డును, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్లను లెక్కచేయకుండా ఆక్రమించి ప్లాట్లుగా మార్చి షట్టర్ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. సాగర్ వాటర్ పెద్ద పైప్‌లైన్, డ్రైనేజీ లైన్ ఉన్న స్థలంలోనే నిర్మాణాలు చేపట్టడం వల్ల ముత్యాలమ్మ గుడి వద్ద రోడ్డు పూర్తిగా మూసుకుపోయి, పాదచారులకు కూడా దారి లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కాలనీలో సరియైన డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు, ఈగల ముప్పు పెరిగి రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. కమిషనర్ స్వయంగా వచ్చి పరిశీలించి, అక్రమ నిర్మాణాలను అడ్డుకుని న్యాయం చేయాలని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బైరు సైదులు గౌడ్, గంట్ల బిక్షమయ్య, అయితగోని సంతోష్, శంకరయ్య, అరుణ్, బుచ్చి రాములు, సత్తయ్య, రామ్ రెడ్డి, శివారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.