ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

*ఆదివారం రాత్రి నుండి బంద్.. ఆటో ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస)*

మందమర్రి, ఆగస్టు 23 అక్షర కలం:

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు ఇప్పటికి పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం రాత్రి నుండి ఆటోలు బంద్‌ పాటించడం జరుగుతుందని, ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతూ సహకరించాలని ఆటో యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి ఐకాస నాయకులు కోరారు. ఆదివారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల మంది ఆటోడ్రైవర్లు ఆటో నడిపే వృత్తినే ప్రధాన జీవనాధారంగా చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహన మరమ్మత్తుల తోపాటు ఫైనాన్స్ భారం, చలాన్లు, ఇన్సూరెన్స్లు, ఫిటెనెస్లు తదితర ఖర్చలు పెరగడంతో ఆటోడ్రైవర్ల జీవనం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గి, వేలాది కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం స్వాగతించ తగ్గ విషయమని, అయితే సంక్షేమ బోర్డుతో పాటు ఆటో ఇతర ప్రధాన సమస్యలపై సైతం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకండా జిఓ ను జారీ చేసి అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు ఆదివారం రాత్రి నుండి నిరవధిక బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవి ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12 వేల ప్రోత్సాహకం అందజేయాలని, ఫ్రీ బస్సుల వలన ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, ఆటో కార్మికులకు, వారి కుటుంబాలకు 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోలకు ఫిట్‌ నెస్ రద్దు చేయాలని, ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ల వల్ల ఆటో కార్మికులు నష్టపోతుండటంతో వాటిని వెంటనే నియంత్రించాలని, అదేవిధంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ లను మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇండ్లను, డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన ఆటో కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలకు అనుగుణంగా ఆటో చార్జీలు పెంచాలన్నారు. ఆటో కార్మికుల కుటుంబాలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం, సముచితంగా కల్పించాలని కోరారు. ఆటోలకు, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించాలని, త్రీ వీలర్ లైసెన్సులను పునరుద్దించాలని, ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్లు, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేసి, విశ్రాంతి గదులు (మంచినీటి వసతి, టాయిలెట్) ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్లు అన్నింటికీ ఆటో భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు‌. ఈ కార్యక్రమంలో ఐకాస నాయకులు మొయ్య రాంబాబు, నేరేళ్ల వెంకటేష్, గోషిక ప్రభాకర్, పంబాల శ్రీనివాస్, బొల్లు రవి, మామిడి క్రాంతి, గంగిపెల్లి అంజి, తడిగొప్పుల సంపత్, సిరిపురం రవి, ఎదులపురం రాజు, ఈరవేణి లక్ష్మణ్, బొల్లం రమేష్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.