పొలాలను ఖాళీగా ఉంచొద్దు

–ఆరుతడి, ఉద్యాన పంటలు వేయండి

— జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం

— కాంటిన్జెన్సీ ప్లాన్ ఆధారంగా 4 రోజుల్లో రైతువారీ డేటా సేకరణ

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని రైతులు కూరగాయలు, పండ్ల తోటలు పెంచే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.గురువారం అయన వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఆగస్టు తో పాటు, సెప్టెంబర్ మొదటివారంలో సరైన వర్షాలు వచ్చే అవకాశం లేదని, అంతేకాక శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండనందున కిందికి నీరు వదిలే అవకాశం లేనందున రైతులు పొలాలను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా ప్రతి ఎంఈఓ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి కూరగాయలు లేదా పండ్ల తోటలు ,ఆయిల్ ఫామ్ వంటి తోటలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా జిల్లాలో 4 వేల ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందని, వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రతి రైతును ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే కూరగాయల సాగు చేసేందుకు అవకాశం ఉన్న భూములలో కూరగాయలు సాగు చేయించాలని, ఆగస్టు నెలలో వేసేందుకు అవకాశం ఉన్న ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని, కమాండ్ ఏరియాలో కూడా ప్రత్యేకమైన పంటలకు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రభుత్వం సూచించిన కాంటిన్జెన్సీ ప్లాన్ ను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. మరోసారి మండలాలలో రైతు వారిగా పంటల వివరాలను సేకరించడమే కాకుండా పంటల వైవిధ్యం పై ప్రతి రైతుకు తెలియజేయాలని,4,5 రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఉద్యాన పంటలు, కూరగాయల పంటల సాగు సమయంలో అడవి పందులు, ఇతర జంతువుల బెడద లేకుండా ఉండే పంటలను వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు .అయితే పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో ఏ రైతును బలవంత పెట్టొద్దని, వారికి అవగాహన మాత్రం కల్పించాలని, రైతులు వారి సమ్మతితో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి టి .శేఖర్, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.