— ప్రేమించి పెళ్లి చేసుకుని కులం పేరుతో వేధింపులు
— నిందితులకు 18 నెలల జైలు శిక్ష విధించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు
ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం
ప్రేమ పేరుతో వెంటబడి పెళ్లి చేసుకున్న అనంతరం, కులం పేరుతో అవమానిస్తూ, భౌతిక, మానసిక వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టిన ఘటనలో నల్గొండలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ మొత్తం 18 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయమూర్తి రోజా రమణి శుక్రవారం తీర్పు చెప్పారు.
–ఘటన నేపథ్యం…
నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో (క్రైమ్ నెం.24/2021, ఎస్. సి.నెం41/2021) నమోదైన వివరాల ప్రకారం… షెడ్యూల్డ్ కాస్ట్ ( ఎస్సీ-మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బాధితురాలు కళాశాలలో చదువుతున్న సమయంలో నిందితుడు (ఏ -1) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి, వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లి తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు ఆమెను భార్యగా అంగీకరించకపోగా, కులం పేరుతో నిత్యం అవమానాలకు గురిచేశారు. మానసికంగా తీవ్రంగా వేధించడమే కాకుండా, ఇంట్లోకి రానివ్వకుండా పశువుల కొట్టంలో ఉంచడం, చివరకు ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారు.
అంతేకాకుండా, కొత్త ఇంటి నిర్మాణం కోసం అదనంగా డబ్బులు, కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారని, భర్త ఆమెను తనతో తీసుకెళ్లేందుకు నిరాకరిస్తూ మరో వివాహం చేసుకునేందుకు సిద్ధపడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
–కోర్టులో బలమైన ఆధారాలు, వాదనలు..
విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ దర్శనం నరసింహ బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసులో బాధితురాలిపై జరిగిన దారుణాలను విడివిడిగా కాకుండా ప్రేమ, పెళ్లి, కుల వ్యతిరేకత, అవమానాలు, పశువుల కొట్టంలో ఉంచడం, కట్నం వేధింపుల వరకు జరిగిన మొత్తం పరిణామాల పరంపరగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు. బాధితురాలి సాక్ష్యంతో పాటు ఆమె తల్లి, ఇతర సాక్షుల వాంగ్మూలాలు, గ్రామ పెద్దలు, పోలీసుల జోక్యం, ‘సఖి’ కేంద్రంలో నమోదైన రికార్డులు, తహసీల్దార్ ద్వారా సేకరించిన అధికారిక కుల ధృవీకరణ పత్రాలు, దర్యాప్తు అధికారుల సాక్ష్యాలు ఈ కేసులో దోషులను చట్టం ముందు నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి.
–న్యాయస్థానం తీర్పు..
కులం పేరుతో ఒక మహిళను అవమానించడం, ఆమె గౌరవాన్ని కించపరచడం, వేధించడాన్ని చట్టం ఏమాత్రం సహించదని స్పెషల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ దర్శనం నరసింహ వినిపించిన వాదనలతో గౌరవ న్యాయమూర్తి ఏకీభవించారు. ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టం బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని పేర్కొంటూ నిందితులకు 18 నెలల జైలు శిక్ష జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బాధితురాలికి న్యాయం చేకూర్చేలా వెలువడిన ఈ సంచలన తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.