– విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు నిందితుల అరెస్టు
– రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
– పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు
జమ్మికుంట, జూలై 7 (అక్షర కలం):
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ శివారులో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం, మానేరు అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన కోరపల్లి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు శ్రావణ్, దేవేందర్‌ల విధులకు ఆటంకం కలిగించి, వారిపై దాడికి పాల్పడిన విలాసాగర్ గ్రామానికి చెందిన రాచపల్లి ప్రశాంత్, రాచపల్లి సమ్మయ్య, రాచపల్లి రాజులను అరెస్టు చేశారు. ఘటన సమయంలో పోలీసుల విధులను అడ్డుకుంటూ ఇసుక రవాణాను ఆపవద్దంటూ దౌర్జన్యానికి పాల్పడిన నిందితులు, అక్కడి ఘటనను వీడియో తీస్తున్న దొగ్గల రాజును వెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ సమీపంలో అడ్డగించి తీవ్రంగా కొట్టి అతని ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ క్రాస్ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై రౌడీషీట్ కూడా తెరవనున్నట్లు తెలిపారు.
●●అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు:
మానేరు పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మాధవి హెచ్చరించారు. ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యువత అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐలు రమేష్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.