— చట్టానికి నీళ్ళు వదులుతున్న పంచాయతీ కార్యదర్శులు !
—సెలవు రోజుల్లో డేట్లు ఇచ్చి… తనిఖీ సమయానికి ముఖం చాటేసిన వైనం
–ఎంపీడీవో కు ఫిర్యాదు
–ఉద్దేశపూర్వకంగానే చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
–బైరు సైదులు గౌడ్ ధ్వజం
అక్షరకలం నల్గొండ
సమాచార హక్కు చట్టం -2005 ను కనగల్ మండలంలోని పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తుంగలో తొక్కుతున్నారు. చట్టప్రకారం ప్రజలకు సమాచారం అందించాల్సి ఉండగా… రికార్డుల తనిఖీల పేరుతో దరఖాస్తుదారులను తీవ్ర అవేదనకు గురిచేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమాలు, బాధ్యతారాహిత్యంపై సమాచార హక్కు వికాస సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బైరు సైదులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు తుంగతుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో కనగల్ ఎంపీడీవో వేద రక్షిత, ఎంపీఓలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
–చట్టాన్ని హేళన చేస్తున్న వైఖరి !
కనగల్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సమాచార హక్కు చట్టం 2005 (ఆర్టిఐ ) కింద దాఖలు చేసిన దరఖాస్తులపై పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
—ఒకే సమయం.. 15 మందికి పిలుపు…
మండలంలోని 15 మంది పంచాయతీ కార్యదర్శులు ఒకే రోజు, ఒకే సమయానికి రికార్డుల తనిఖీకి రావాలని దరఖాస్తుదారులకు సూచించడం గమనార్హం. చట్టవిరుద్ధంగా 12 గంటల సమయం.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా నోటీసు ఇచ్చి, కేవలం 12 గంటల వ్యవధిలోనే తనిఖీకి రావాలని ఒత్తిడి తెచ్చారు. సెలవు రోజుల్లో డేట్లు.. గడువు దాటినా నిర్లక్ష్యం… ప్రభుత్వ సెలవు దినాల్లో తనిఖీలకు తేదీలు కేటాయించడమే కాకుండా, చట్ట ప్రకారం నిర్దేశించిన 30 రోజుల గడువు ముగిసిన తర్వాత మరికొందరు తేదీలు ఇచ్చారు. కొందరైతే ఇప్పటికీ తేదీలను కూడా కేటాయించలేదు.
—తనిఖీకి వెళ్తే గైర్హాజరు.. ఫోన్లు కూడా ఎత్తరు…
ఇచ్చిన తేదీల ప్రకారం మూడు గ్రామ పంచాయతీలకు వెళ్లగా, అక్కడ ఒక్క కార్యదర్శి కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకుండా ముఖం చాటేశారు. పైఅధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కనగల్ మండలంలో పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీఐ చట్టం 2005 ను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం నిర్ణీత 30 రోజుల గడువు దాటినందున సెక్షన్ 7(6) నిబంధననను అనుసరించి కోరిన సమాచార ప్రతులను, రికార్డులను పూర్తిగా ఉచితంగా ధ్రువీకరించి ఇవ్వాలి. విధులకు హాజరుకాకుండా, దరఖాస్తుదారులను తిప్పించుకుంటూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శులపై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదు లో కోరారు.