*15 లోపు లాభాల వాటా ప్రకటన
*విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నేతలు
మందమర్రి, అక్టోబర్ 12 అక్షర కలం:
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటియుసి పూర్తిగా విఫలమైందని, యాజమాన్యంతో చర్చించి సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్ష సంఘం మాదిరిగా గుర్తింపు సంఘం హోదాలో ధర్నాలు నిర్వహిస్తూ, ప్రతిపక్ష సంఘం పాత్ర పోషిస్తుందని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంశెట్టి నరేందర్ లు విమర్శించారు. సోమవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ, అక్టోబర్ 15 లోపు కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను, లాభాల వాటా ను ప్రకటించి, కార్మికుల ఖాతాల సైతం లాభాల వాటా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తో పాటు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, సింగరేణి సిఎండి, డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, కేంద్ర రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ హాజరయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణిలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలను చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో యాజమాన్యం మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా నూతన గనులు లేకపోవడంతో సింగరేణిలో అధికంగా కార్మికులు ఉన్నారని, అందువలనే మెడికల్ బోర్డు నిర్వహించలేకపోయామని యాజమాన్యం తెలుపగా, రాష్ట్ర మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం యాజమాన్యం విధానంపై ఆగ్రహం వ్యక్తం చేసి, మెడికల్ బోర్డు నిర్వహించాలని, అదేవిధంగా 10,12 శాతం మాత్రమే మెడికల్ ఇన్ వాల్యుడేషన్ చేయకుండా 80, 90 శాతం ఉండేలా చూడాలని యాజమాన్యాన్ని ఆదేశించారన్నారు. నూతన గనుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, దానికి ప్రభుత్వ సాకారం ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలపై సైతం సాధ్యాసాధ్యులు పరిశీలించాలని ఆదేశించడం జరిగిందన్నారు. పెర్క్స్ పై ఐటి రియంబర్స్మెంట్ కొరకు జనక్ ప్రసాద్ విశేష కృషి చేస్తున్నారని, అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు అవకాశం కల్పించడం తోపాటు యాజమాన్య ఇటీవల తీసుకు వచ్చిన అక్రమ ఉత్తర్వుల రద్దు కొరకు సైతం కృషి చేస్తున్నారని తెలిపారు. రోడ్లపై కొట్లాడుతూ, సందులో కలిసి తిరుగుతూ, అక్రమ పొత్తు పెట్టుకున్న కొన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ యూనియన్ లపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఐఎన్టియుసి నిరంతరం కార్మికుల కోసం, వారి హక్కులు, రక్షణ, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో సైతం పోరు చేస్తామని స్పష్టం చేశారు. యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంశెట్టి నరేందర్ మాట్లాడుతూ, గుర్తింపు సంఘంగా ఏఐటియుసి పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష సంఘం ఐఎన్టియుసి గుర్తింపు సంఘం పాత్ర పోషిస్తుందని తెలిపారు. యూనియన్ నేత జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ, సింగరేణిలో నెలకొన్న పరిణామాలను, కార్మిక సమస్యలు వారి దృష్టికి తీసుకు వెళ్తున్నారని, దీంతో కార్మికుల అభివృద్ధికి, సింగరేణి పునర్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు వచ్చి, చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులు, సింగరేణి యాజమాన్యంతో సుమారు నాలుగు ఐదు గంటలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అక్టోబర్ 15లోపు లాభాల వాటా పై ప్రకటన వెలువడుతుందని, లాభాల వాటా ప్రకటన అనంతరం తమ పోరాటాలతోనే లాభాల వాటా ప్రకటించాయని కొన్ని సంఘాలు జబ్బలు చరుచుకుంటాయని ఎద్దేవా చేశారు. సింగరేణిలో చైతన్యవంతమైన కార్మిక వర్గం ఉందని, కార్మిక సమస్యల పరిష్కారానికి, సింగరేణి అభివృద్ధికి జనక్ ప్రసాద్ చేస్తున్న కృషి వారికి తెలుసునని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మిగిలిన సంఘాలు సైతం ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గత పాలకులు చేసిన అపార నష్టంతోనే సింగరేణి తిరోగమనంలో పయనిస్తుందని, వారి చేతకానితనంతోనే సింగరేణి మసకబారుతుందని ఆరోపించారు. సింగరేణి అభివృద్ధికి, కార్మిక సంక్షేమంతో పాటు నూతన గనుల ఏర్పాటుకు విద్యుత్ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐఎన్టియుసి తాడిచెర్ల 2, మణుగూరు డిప్ సైడ్ బ్లాకులు సాధించేందుకు చేసిన పోరాట స్ఫూర్తితోనే రానున్న రోజుల్లో సత్తుపల్లి, కోయగుడెం, శ్రావణ్ పెళ్లి బ్లాకులు సైతం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి, వేల కోట్ల రూపాయలు లాభాలు సాధిస్తున్న సింగరేణిలో కార్మికులకు సరైన పనిముట్లు లేకపోవడం బాధాకరమన్నారు. సరైన పనిముట్లు లేకపోతే కార్మికులు విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కార్మికులు, అధికారులు సంస్థకు రెండు చేతులు లాంటి వారిని, ఇరువురు కలిసి శ్రమిస్తేనే సింగరేణి అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. అధికారులకు చెల్లించాల్సిన పిఆర్సి పై సైతం ప్రభుత్వ పెద్దల దృష్టి తీసుకు వెళ్ళడం జరిగిందన్నారు. మారుపేర్ల సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే కమిటీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్టియుసి నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు కృషి చేస్తుందని, కార్మికులు యూనియన్ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, నాయకులు డి శంకర్రావు, కే ఓదేలు, ఎం అంబేద్కర్, ఎస్ కన్నయ్య, దావ రమేష్, భాస్కరాచారి, ఎస్ రాములు, కే స్వామి, పైడిపల్లి శ్రీకాంత్, వి వీరమల్లు, సిహెచ్ మధుబాబు, డి రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.