​ఏపీ నేతలు తెలంగాణ వైపు చూడొద్దు

— పంట మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలి

— శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, వ్యవసాయ అంశాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. అది సరైన సమయం కాదని హితావు పలికారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న భాష, ఆయన తీరు అస్సలు బాలేదు. రాజకీయాల్లో పరస్పర దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదు. తెలంగాణలో ఎలాంటి విద్వేషాలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఏపీ అభివృద్ధిపైనే కూటమి నేతలు దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు అమరావతిని బ్రహ్మాండమైన రాజధాని అని చెబుతున్నారు. అలాంటప్పుడు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ అమరావతిలోనే నివాసం ఉండాలని అన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ వనరులు (సోర్సెస్) ఉన్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీరం, రకరకాల పోర్టులు ఉన్నాయి. ఏపీ నేతలు వారి రాష్ట్ర అభివృద్ధిని చూసుకోవాలి తప్ప, తెలంగాణ వైపు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పటికే 75 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది. అయితే ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం తగినంతగా సహకరించడం లేదు. అందువల్లే కొనుగోళ్ల ప్రక్రియలో కొంత ఆలస్యమైంది.

​రైతులు పంట మార్పిడి వైపు వెళ్ళాలి.

తెలంగాణలో రైతులు కేవలం వరి, పత్తి పంటలను తప్ప మరే ఇతర పంటలను పండించడం లేదు. రైతులు ఇకనైనా సాంప్రదాయ పద్ధతులను వీడి, లాభసాటిగా ఉండే పంట మార్పిడి (క్రాప్ రొటేషన్) వైపు దృష్టి సారించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.