అంతర్జాతీయ వేదికపై దేశం తరపున గళం*
(అక్షర కలం,వెబ్) మంచిర్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10:
ప్రపంచ దేశాలన్నీ కలిసి అభివృద్ధి చెందాలనేదే భారత దేశం ఆశయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి రెండో కమిటీలోని మ్యాక్రో ఎకనామిక్ పాలసీ ప్రశ్నలు, ఫైనాన్స్ ఫర్ డెవలప్మెంట్ పై జరిగిన సాధారణ చర్చల్లో ఆయన దేశం తరఫున ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సంక్షోభ దశలో ఉందని, వృద్ధి మందగించిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రపంచ వాణిజ్యం సమ్మిళిత అభివృద్ధికి ఇంజిన్ లా పని చేయాలని సూచించారు. న్యాయమైనా, పారదర్శకమైన, సమగ్ర వ్యాణిజ్య వ్యవస్థకే భారత దేశం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుక ప్రపంచ వేదికలపై వినిపించాలన్నదే భారతదేశం అభిప్రాయమన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఆధ్వర్యంలో ఉన్న అంతర్జాతీయ వ్యాపార నియమాలకు దేశాలన్నీ కట్టుబడి ఉండాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం గ్లోబల్ వ్యాల్యూ చైన్ లో పెరగాలని, అప్పుల పారదర్శకత, సమర్ధవంతమైన నిర్వాహణ అత్యవసరమని వివరించారు. సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే పెట్టుబడులను వేగంగా సమీకరించాలని, అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే స్థిరమైన ప్రపంచ అభివృద్ధి సాధ్యమని తెలిపారు.