నకిరేకల్ నియోజకవర్గం : అక్షర కలం (ప్రతినిధి)
విద్యార్థుల భవిష్యత్తు బాటిలు వేసే పవిత్ర వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే సంఘటన నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. గత మూడు నెలలుగా ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు చేస్తుండడంతో విద్యార్థిని తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పటంతో ఉపాధ్యాయుని యొక్క బాగోతం వెలుగు చూసింది.. నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్ పదవ తరగతి విద్యార్థినిపై గత మూడు నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థిని ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేక మూడు నెలలుగా నరకయాతన అనుభవించింది. తన తండ్రి ఏంటని ప్రశ్నించడంతో శుక్రవారం రాత్రి అసలు విషయాన్ని తండ్రికి వివరించింది. వెంటనే ఆగ్రహించిన తండ్రి శనివారం ఉదయం శ్రీనివాస్ ను పిలిపించి దేహశుద్ధి చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేయటంతో పాటు ప్రైవేటు కళాశాలను నడుపుతున్న ఈ కీచక ఉపాధ్యాయుడు అక్కడ సైతం అనేకమంది విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన శ్రీనివాస్ పై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.