ఆశ్రిత పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రక్రియ

— ప్రత్యేక కేటగిరీలకు ప్రాధాన్యత

–నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల బదిలీలు

—జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రేడ్ వన్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీల ప్రక్రియపై పంచాయతీ కార్యదర్శులకు ఆయన క్షుణ్ణంగా వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగుల జాబితాను రూపొందించడం జరిగిందని, వారు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ప్రత్యేక కేటగిరీలకు ప్రాధాన్యత ఇస్తూ బదిలీలు చేపట్టినట్టు వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖలలో బదిలీలను పూర్తి పారదర్శకంగా, నియమ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు .

బదిలీల సందర్భంగా భార్యాభర్తల కేసులు, వైద్య కారణాలు, ఇతర అన్ని రకాల కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని బదిలీలు చేపట్టడం జరిగిందని ,ఎలాంటి బంధుప్రీతి, ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలను సైతం చేపట్టడం జరిగిందని చెప్పారు.

  స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్, తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా పరిషత్ లో నిర్వహించిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. జడ్పి సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.