ఒట్టు…మూసి ముఖచిత్రం మారుస్తా.. ఇది నా శపథం —సీఎం రేవంత్ రెడ్డి

—రూ.18,006 కోట్లతో 441 హ్యామ్ రోడ్ల విప్లవానికి శ్రీకారం

​—పదేళ్ల మీ విధ్వంసం.. రెండేళ్ల మా వికాసంపై అసెంబ్లీలో తేల్చుకుందాం.. రండి 

​–నల్గొండ గడ్డపై నుంచే భారాస నేతలకు ముఖ్యమంత్రి బహిరంగ సవాల్

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం   

ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దేశానికే తలమానికంగా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతాం. కాలుష్య కోరల్లో చిక్కుకుని నలిగిపోతున్న నల్గొండ బిడ్డలకు ఆ మహమ్మారి నుంచి విముక్తి కలిగిస్తాం. ఇది నా శపథం.. ఒట్టేసి చెబుతున్నా.. మూసీ ప్రక్షాళన తథ్యం అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత భావోద్వేగంతో ప్రకటించారు. ఆదివారం నల్గొండ జిల్లా కనగల్ వేదికగా రాష్ట్ర మౌలిక వసతుల రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.18,006 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 6,082 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 441 హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ( హ్యాం) రోడ్ల పనులకు సీఎం భూమిపూజ చేసి, పైలాన్‌ను ఆవిష్కరించారు. దీంతో పాటు నల్గొండ కార్పొరేషన్‌లో రూ.83 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక తాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో జనసంద్రమైన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష భారాసపై నిప్పులు చెరిగారు.

—-బావబామ్మర్దుల రచ్చబండకు మేం సిద్ధం…

భారాస ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బావబామ్మర్దులు ఇద్దరూ కలిసి ఊళ్లు తిరుగుతూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎందుకు మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి? పరీక్ష పేపర్లు అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ రూ. వేల కోట్లు సంపాదించుకున్నందుకా? లేక కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్లు కొల్లగొట్టినందుకా? పేదోళ్లు రేషన్ కార్డులు అడిగితే పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించినందుకా? దేనికోసం మిమ్మల్ని ప్రజలు నెత్తిన పెట్టుకోవాలి? రండి.. దమ్ముంటే రచ్చబండలో చర్చ పెడదాం అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని కొందరు అహంకారంతో ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడడిగినా ప్రత్యేక శాసనసభ, మండలి సమావేశాలు ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్ల భారాస పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలన, కేంద్రంలోని పన్నెండేళ్ల బీజేపీ పాలనపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘ చర్చ పెడదాం. ఎవరి దమ్ము ఎంతో అక్కడే తేలుస్తాం అని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ఊరూరా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో, గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. “తెలంగాణ సమాజం మీ నాటకాలను నమ్మదు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా బహిష్కరించింది. 2034 వరకు రాష్ట్రంలో మూడు రంగుల జెండాయే ఎగురుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

–వారి త్యాగాలను ఏమనాలి?

 ‘బీఆర్ఎస్ త్యాగాల పునాదులపై తెలంగాణ వచ్చిందన్నారు. మీవి త్యాగాలా? ఆ పేరుతో రాజీనామాలు చేసి ఎన్నికలు తెచ్చి కలెళ్లన్లు చేశారు. మీరు చేసినవే త్యాగాలంటే.. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన త్యాగాలను ఏమనాలి? 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ మంత్రి పదవి తీసుకోలేదు. మలి దశ ఉద్యమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వదిలేసి, నల్లగొండ గడ్డపై తెలం గాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తెలంగాణ వచ్చాకే పదవి తీసుకుంటానని ప్రతినబూని వచ్చాకే మళ్లీ మంత్రి పదవి తీసుకున్నారు. రూ.100 పెట్రోలు తెచ్చుకుని రూపాయి అగ్గిపెట్టె తెచ్చుకోలేని హరీశీరావుది త్యాగమా ? శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యలవి త్యాగమా? అగ్గిపెట్టి హరీష్ రావు ఆర్థిక మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు తెలంగాణ అప్పులు రూ.69 వేల కోట్లు ఉంటే బీఆర్ఎస్ పాలనలో రూ.8.11 లక్షల కోట్లకు పెంచాడు. అలాంటి వారి దోపిడీని ప్రజలు ఇంసహించాలా? పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించిన మిమ్మల్ని ఏమనాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

-నల్గొండకు సాగునీటి భాగ్యం.. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..

గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

​ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పనులను 34 కిలోమీటర్ల మేర పూర్తి చేసి భారాసకు అప్పగిస్తే.. కేవలం 10 కిలోమీటర్ల పనులను పదేళ్లపాటు అలానే అటకెక్కించారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేసి 1.60 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తాం” అని హామీ ఇచ్చారు.

డిండి ప్రాజెక్టు.. డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.

​మూసీ కాలుష్య కోరలు…”నా పాదయాత్ర సమయంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజల కష్టాలను కళ్లారా చూశాను. కాలుష్యంతో ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు ప్రాంతాలు ఎంత దారుణంగా మారాయో నాకు తెలుసు. అందుకే మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నాను” అని వివరించారు.

–వందల మంది అంబేడ్కర్లను తయారు చేయడమే లక్ష్యం

శాఖల వారీగా లెక్కలతో సహా నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని సీఎం చెప్పారు. కేవలం 30 నెలల కాలంలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? శాసనసభకు రండి, లెక్కలు చెప్తా” అని సవాల్ విసిరారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్మెంట్, రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.27వేల కోట్ల రైతు భరోసా, స్కిల్స్ యూనివర్సిటీలు తెచ్చినందుకు ఈ ప్రజా ప్రభుత్వం పోవాలా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా, ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తూ వందల మంది అంబేడ్కర్లను తయారు చేయడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

— ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కడుపు మంట ..?

భారాస ఐదేళ్ల మంత్రివర్గంలో కనీసం ఒక్క ఆడబిడ్డకైనా చోటు కల్పించారా? పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం ఆర్థికంగా భారమైనా పేదవారి కడుపు నింపాలని రూ.16 వేల కోట్లతో 3.28 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తోంది. మీరు గజ్వేల్‌లో, మీ కుమారుడు, కుమార్తె, అల్లుడు వందల కోట్లతో ఫామ్‌హౌస్‌లు కట్టుకోవచ్చు కానీ.. పేదోడికి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే మీకు కడుపు మంట ఎందుకు? ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నాం” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

—మహిళా శక్తికి అండగా రూ.172 కోట్ల వడ్డీ లేని రుణాలు…

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జిల్లాలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.172 కోట్ల భారీ చెక్కును మహిళా సంఘాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందజేశారు. అలాగే నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలోని మహిళలకు మెప్మా ఆధ్వర్యంలో రూ.11 కోట్ల పొదుపు సంఘాల చెక్కులను పంపిణీ చేశారు.

—ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాలు…

అహంకార ధోరణిని అణచివేశాం.. (డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క)

​గత భారాస ప్రభుత్వం అహంకార ధోరణితో కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రజలను పదేళ్లపాటు చిత్రహింసలకు గురిచేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. “భారాస విస్మరించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మేం వచ్చాక 90 శాతం పూర్తి చేశాం. మహిళలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం. రహదారుల నిర్మాణాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన చరిత్ర మా ప్రభుత్వానిదే” అని స్పష్టం చేశారు.

—భారాస కాస్తా ‘హెచ్ఆర్ఎస్’ అవుతుంది.. ( మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి )

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. భారాస పూటకో పార్టీ పేరు మారుస్తూ ప్రజలను మోసం చేస్తోందని, రేపు ఆ పార్టీ ‘హెచ్ఆర్ఎస్’ (హరీశ్ రావు రాష్ట్ర సమితి)గా మారినా ఆశ్చర్యం లేదన్నారు. “హ్యామ్ రోడ్ల టెండర్లు ప్రారంభం కాకముందే బావబామ్మర్దులు ‘హ్యామ్-స్కామ్’ అంటూ ఏడుస్తున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండి ప్రమాదాలు జరుగుతుంటే సీఎం చొరవతో రూ.6,500 కోట్లు రాష్ట్ర నిధులు కేటాయించాం. హ్యామ్ పథకం ద్వారా ఆర్అండ్‌బీ నుంచి రూ.13 వేల కోట్లు, పంచాయతీరాజ్ నుంచి రూ.7 వేల కోట్లు కేటాయించాం. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని రూ.10,400 కోట్లతో 6 లైన్లుగా విస్తరించేందుకు టెండర్లు పిలిచాం. కనగల్ నుంచి గుర్రంపోడు మీదుగా బందరు, అమరావతికి 300 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే డి పి ఆర్ పూర్తయింది. మొత్తంగా రహదారుల కోసం రూ.78 వేల కోట్లు కేటాయించాం” అని వివరించారు.

​—రైతులకు రూ.19,313 కోట్లు చెల్లించాం.. ( మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి)

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులతో పాటు నాగార్జునసాగర్ కాలువల ఆధునీకరణ, బస్వాపూర్, గంధమల్ల, బునాదిగాని ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. “దేశంలోనే ఎక్కడా లేని విధంగా రెండు పంటల కాలంలో 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. కేవలం యాసంగిలోనే 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొని, రూ.19,313 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం” అని తెలిపారు.

​—ప్రగతి బాటలో రహదారులు.. (ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్)

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే భారీ ప్రాజెక్టులు, అత్యాధునిక రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం గ్రీన్ ఫీల్డ్ రహదారులను మరిన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, బీర్ల అయిలయ్య, సామేల్, వేముల వీరేశం, అనిల్ కుమార్ రెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, కోటిరెడ్డి, నేలికంటి సత్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.