డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు

—బిఆర్ఎస్ నేతల ఆందోళన 

—రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు 

—స్పందించిన జిల్లా కలెక్టర్

— ఆర్వో సస్పెండ్, వ్యక్తిపై ఎఫ్ఐఆర్  

—విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీవో నియామకం 

 అక్షరకలం ప్రతినిధి, నల్గొండ 

నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఫలితాల విడుదల క్రమంలో శుక్రవారం చిట్యాల మండలంలో మరో వివాదం తెరమీదకొచ్చింది. డ్రైనేజీ లో ఓటర్ బ్యాలెట్ పేపర్లు కనిపించడం సంచలనం రేకితిస్తుంది. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడినట్లు బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైనేజీలో పడేసిన బ్యాలెట్ పేపర్లు బిఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థికి పోలైన ఓటర్ స్లిప్స్ గా బిఆర్ఎస్ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. అదే సందర్భంలో డ్రైనేజీలో వంద లాదిగా కొట్టుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేసిన స్లిప్స్ వెలుగు చూడడంతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, నకిరేకల్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యేలు ఘటనా స్థలానికి చేరుకొని కౌంటింగ్ సెంటర్ దగ్గర పడవేసిన ఓటర్ల స్లిప్స్ ను పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపద్యంలో డ్రైనేజీలో ఓటర్ స్లిప్పుల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైనేజీ లో లభించిన ఓట్లు వేసినటువంటి బ్యాలెట్ పేపర్ల వ్యవహారం అధికారికంగా విచారణ అనంతరం వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. అయితే గురువారం జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారు ఆర్. భిక్షం 455 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

—-స్టేజ్ టు ఆర్వో సస్పెండ్….

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన సంఘటన లో స్టేజ్ 2 ఆర్ఓ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన 

పేరు తెలియని వ్యక్తి పై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ మొత్తం సంఘటనపై విచారణ నిర్వహించేందుకుగాను నల్గొండ ఆర్డివో ను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటిని ఆర్డిఓ సమక్షంలో భద్రపరచాలని, దీనిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.