విశ్వశాంతి కేంద్రంగా ‘బుద్ధవనం’

—గ్లోబల్ బుద్ధిస్ట్ హబ్‌గా నాగార్జునసాగర్

​—గ్రామ గ్రామానికి బుద్ధుని బోధనలు

 –ప్రభాత్ భేరి తో సరికొత్త ఆధ్యాత్మిక విప్లవం 

–నేను అనే స్వార్థం వీడి “మనం” అనే భావనతోనే సమస్యల పరిష్కారం సాధ్యం 

— మంత్రులు జూపల్లి, వివేక్ వెంకట స్వామి 

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళారూపాలు, వివిధ మాధ్యమాల ద్వారా బుద్దుని బోధనలను గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు. సోమవారం అయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధ వనంలో మూడవ బుద్ధ ధమ్మ యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కార్యక్రమానికి వివిధ దేశాల నుండి హాజరైన బౌద్ధ బిక్షువులను ఉద్దేశించిన మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ బుద్ధుని ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని అన్నారు. బుద్ధుని బోధనలైన కరుణ, ప్రేమ, దయ వంటి వాటిని ప్రజల హృదయాలలో తిరిగి నింపేందుకు బౌద్ధ బిక్షువులు నెలరోజుల పాటు కర్ణాటకలోని కాలబురిగి నుండి తెలంగాణలోని బుద్ధ వనం వరకు నిర్వహించిన పాదయాత్ర సందేశం ఇచ్చిందని అన్నారు.

బుధవనాన్ని వరల్డ్ క్లాస్ హెరిటేజ్ కేంద్రంగా తీర్చి దిద్దుతామని, పబ్లిక్ ప్రైవేట్ బాగ స్వామ్యం తో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి గ్లోబల్ బుద్ధిష్ట్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే బుధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దమ్మ యాత్ర ప్రారంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో బుద్ధ వనం ప్రపంచానికే వెలుగునిస్తుందని అన్నారు. నేను, నాది అన్న స్వార్థం వదిలి మనది అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ముందుకెళితే సమస్యలు పరిష్కారం అవుతాయని, బుద్ధుని బోధనలను సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళారూపాల ద్వారా గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని, అంతేకాక సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా కూడా తీసుకెళ్తామని, ఇందులో భాగంగానే రచయితలు అందరిని ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలను తీసుకోవడం ద్వారా “ప్రభాథ్ భేరి”పేరుతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.మరో మంత్రి, రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని, శాంతియుతంగా ,ఆశావాద దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేందుకు బుద్ధుని బోధనలు ఉపకరిస్తాయని తెలిపారు బుద్ధవనం రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందని, బుద్ధవనాన్ని టూరిజం మాన్యుమెంట్ గా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, బుద్ధ సాంస్కృతిక అంబాసిడర్ గగన్ మాలిక్ బుద్ధ వనం స్పెషలాఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షులు సిద్ధార్థ్, థాయ్ ల్యాండ్ బౌద్ధ సన్యాసులతోపాటు వచ్చిన శ్రీలోక్ కుంతూ , విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి, తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.