షబ్బీర్ వర్సెస్ ధన్ పాల్

  • అర్బన్ పై ఆధిపత్యం కోసం ఆరాటం
  • ఎత్తుకుపై ఎత్తు వేస్తున్న ఇద్దరు నాయకులు
  • అమృత్ పై హైదరాబాద్ లో షబ్బీర్ సమీక్ష
  •  షబ్బీర్ పర్యటనకు ముందే బల్ధియా అధికారులతో ధన్ పాల్ సమీక్ష

బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ సలహాదారు పోటీపడుతున్నారు. షబ్బీర్ ఆలీకి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన నాటి నుంచి ఆయన అర్బన్ పై నజర్ వేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందని చెప్పాలి. ఆ రోజు నుంచి షబ్బీర్ ఆలీ ఏ కార్యక్రమం చేసినా కౌంటర్ కార్యక్రమాలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అర్బన్ లో ఆపార్టీ ఓటమి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ధన్ పాల్ సూర్యనారాయణకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా మోకాళ్లడ్డుతున్నారు. గడిచినఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ధన్ పాల్ సూర్యనారాయణ, కాంగ్రెస్ తరపున షబ్బీర్ ఆలీలు బరిలో నిలిచిన విషయం తెల్సిందే. షబ్బీర్ ఆలీ ఓటమి చవిచూడడం ధన్ పాల్ చట్టసభకు తొలిసారి ఎన్నిక కావడం జరిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీనియర్ మైనార్టీ నేతగా షబ్బీర్ ఆలీకి క్యాబినెట్ హోదాతో కూడిన ప్రభుత్వ సలహాదారునిగా ప్రభుత్వం నియమించడం చకచక జరిగాయి. కామారెడ్డికి చెందిన షబ్బీర్ ఆలీ అసెంబ్లీ ఎన్నకల్లో అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి చెందగా కాంగ్రెస్ నాయకులు ఓడిన వారే ఇంచార్జిలుగా ఉండడంతో షబ్బీర్ ఆలీ అటు కామారెడ్డిపై, ఇటు అర్బన్ పై రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అదే సమయంలో ధన్ పాల్ సూర్యనారాయణ రాజకీయంగా అధికార యంత్రాంగం సహకరించకుండా మోకాళ్లడ్డుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ అర్బన్ లోని 60 డివిజన్ లకు డివిజన్ రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఐదుగురే ఉన్నప్పటికీ నిధుల కేటాయింపు, దానిపై పెత్తనం కాంగ్రెస్ నాయకులకు ఇప్పించడంలో షబ్బీర్ ఆలీ సక్సెస్ అయ్యారు. ఆ రోజు నుంచి షబ్బీర్ ఆలీ చేస్తున్న రాజకీయాన్ని ముందే పసిగట్టిన ధన్ పాల్ దానిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఏకంగా జిల్లా కలెక్టర్ కు బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. కానీ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానానికి పరిమితం కావడం కషాయం పార్టీకి మింగుడు పడడం లేదు. ఇటీవల నిజామాబాద్ నగరానికి చెందిన పలువురు పోలీసు అధికారుల బదిలీ అంతా షబ్బీర్ ఆలీ సిఫారసుతో జరిగిందని ధన్ పాల్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇటీవల బహిరంగంగా పోలీసులు గులాంగిరి చేస్తున్నారన్న వ్యాఖ్యలు చేశారు. గడిచిన నెలలో బొందెం చెరువు కబ్జాలో ఉన్న పలువురు ఇళ్ళను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన విషయం తెల్సిందే. అక్కడ బాధితులకు కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ ఆలీ ద్వారా భరోసా ఇప్పించారు. వారికి ఇందిరమ్మ ఇళ్ళను ఇప్పించడంతో పాటు పట్టాలు ఇస్తామని కలెక్టర్ ద్వారానే హామీ ఇప్పించారు. అప్పటి వరకు నాగారం వైపు కన్నెత్తి చూడని ధన్ పాల్ సూర్యనారాయణ బొందెం చెరువు కబ్జాల వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు చేశారు. కానీ అందులో ప్రధాన సూత్రదారులు తప్పించుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో షబ్బీర్ ఆలీ అమృత్ పథకంపై బల్ధియా అధికారులతో సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. అందులో కాంగ్రెస్ కార్పొరేటర్లు మినహా మిగిలిన పార్టీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోనే భారీ వర్షాలకు నిరాశ్రయులను పరామర్శించేందుకు షబ్బీర్ ఆలీ ఈ నెల 4న నిజామాబాద్ నగరంలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ విషయం తెలిసిన ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం బల్ధియా అధికారులతో హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా క్యాంప్ కార్యాలయంలో అనుకున్న సమావేశం చివరకు మున్సిపల్ కార్యాలయం వేదిక అయింది. అధికారులతో సమీక్షకు మీడియాకు ఆహ్వానం పంపిన ఎమ్మెల్యే తర్వాత వెనక్కి తగ్గారు. సమావేశంలో జరిగిన విషయాలేవి బయటకు తెలియలేదు కానీ చివరకు నోట్ వదిలి చేతులు దులుపుకున్నారు. షబ్బీర్ ఆలీ బుధవారం ఎక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారో అన్న కారణంతోనే ముందస్తుగానే సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆ సమావేశంలోనే కాంగ్రెస్ కార్పొరేటర్లు నల్లబిల్లుల బలవంతపు వసూళ్ల మీద నిరసన తెలిపి కమిషనర్ కు ఫిర్యాదు చేయడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.