నల్లగొండ జిల్లాలో బత్తాయి పంటను కాపాడేందుకు ప్రభుత్వానికి సూచనలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి…

 

నల్లగొండ, ఆగస్టు 30, అక్షర కలం/ ప్రతినిధి :

కమిషన్ రెండు రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో బత్తాయి రైతులు ,ఉద్యాన శాఖ అధికారులు,శాస్త్ర వేత్తలతో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ,సూచనలు, సలహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషన్ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాలో నిడమనూరు మండలంలోని కొన్ని గ్రామాలలో బత్తాయి తోటలను పరిశీలించడమే కాకుండా, రైతులతో మాట్లాడడం జరిగిందని, నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బత్తాయి మార్కెట్ ను సందర్శించి రైతులు, సమస్యలు,అభిప్రాయాలను తెలుసుకొన్నట్లు చెప్పారు. బత్తాయి రైతుల సమస్యలను , అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. భవిష్యత్తులో బత్తాయి పంటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని, ముఖ్యంగా మార్కెట్లో మధ్య దళారీలు వ్యవస్థ, సౌకర్యాలు లేకపోవడం ,నిర్వహణ లోపం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. బత్తాయి మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని ,రైతులు మార్కెట్ కు పంటను తీసుకొచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉందని ,పక్కనే ప్రైవేట్ మార్కెట్ నిర్వహించడం జరుగుతున్నదని, ప్రయివేట్ మార్కెట్ ను ప్రభుత్వ మార్కెట్ తో అనుసంధానం చేయాలని, నల్గొండలో బత్తాయి మార్కెట్ రైతులకు దగ్గరగా ఉండడమే కాకుండా, నమ్మకంగా ఉంటుందని ,ఈ మార్కెట్ ను ఇలాగే కొనసాగించాలని అన్నారు. హైదరాబాదు లాంటి దూర ప్రాంతానికి బత్తాయిని తీసుకువెళ్లడం రవాణా ఖర్చులతో పాటు, రైతులకు ఇబ్బంది కరంగా ఉంటుందని అన్నారు. సాంప్రదాయ పంటగా ఉన్న బత్తాయి పంటను నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో నల్గొండ జిల్లాలో బత్తాయి పంట కనబడకుండా పోతుందని, అందువల్ల రైతులు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏ రకంగా బత్తాయి మార్కెట్ ను కాపాడవచ్చో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని , బత్తాయి పండించే క్షేత్రాలకు వెళ్లి పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని సూచించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వం వీరికి సహకరించి ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు చేస్తే అటు వినియోగదారునికి, ఇటు రైతులకు బాగుంటుందని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశాల మేరకు బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని, బత్తాయి రైతులకు లాభం చేకూర్చే విధంగా శాస్త్రీయమైన పద్ధతిలో ఒక ప్రణాళికను రూపొందిస్తామని, బత్తాయి రైతుల సూచన మేరకు బత్తాయిని పాఠశాలలు, హాస్టల్స్ కు పంపిణీ చేసే విషయమై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను నియమించాలని జిల్లా కలెక్టర్ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. భూవిధాల పరిష్కారంలో భాగంగా సాదా బైనామాల సమస్యలపై స్థానిక సమస్యలపై పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. కొండమల్లేపల్లి లో ఉన్న ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

కమిషన్ సభ్యులు భూమి సునీల్ మాట్లాడుతూ బత్తాయి రైతులను కాపాడేందుకు రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటు, ఆర్థిక చేయూతను అందిస్తే బాగుంటుందని అన్నారు.

మరో సభ్యురాలు భవాని మాట్లాడుతూ బత్తాయి పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రైతులు ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రైవేట్ పరంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పై ఆలోచించాలని చెప్పారు.

మరో సభ్యులు వెంకన్న యాదవ్ మాట్లాడుతూ బత్తాయి నర్సరీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో బలోపేతం చేయాలని, కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన క్షేత్రంలో సిబ్బందిని పెంచి పటిష్టం చేయాలని, చీడపీడలపై నిష్ణాతులను పిలిపించి అధ్యయనం చేయించాలని అన్నారు.

మరో సభ్యుడు కేవీయన్ రెడ్డి మాట్లాడుతూ మల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని పటిష్టం చేసే విధంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తామని , బత్తాయి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పారు .

డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ బత్తాయి మొక్కల లోపం వల్ల ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నట్టు తాము గుర్తించామని,అలాగే చీడ పీడలు, వారి విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాలను గుర్తించామన్నారు. కొండమల్లేపల్లి లోని ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, రైతులు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యను దూరం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ సమావేశానికి హాజరైన బత్తాయి రైతులు ,రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు నంద్యాల నరసింహారెడ్డి, రాంరెడ్డి, కర్నాటి లింగారెడ్డి ,నూకల వెంకటరెడ్డి, అశోక్ రెడ్డి, అంజిరెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, జంగం రాజు ,సత్యనారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ నల్గొండలో బత్తాయి మార్కెట్ ను కాపాడాలని,మధ్య దళారి వ్యవస్థను నిర్మూలించాలని,సిప్రెస్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ,బత్తాయి పంటను స్థానికంగానే అమ్మేలా చూడాలనే,ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు, ఆసుపత్రులకు బత్తాయిని ప్రభుత్వపరంగా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, బత్తాయి పండించే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సౌకర్యాలు కల్పించాలని, బత్తాయికి మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని ,ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి నర్సరీల ఏర్పాటుచేసి నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలని, ఇప్పటి వరకు బత్తాయి పంటలు వేసిన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, బత్తాయి రైతులను ఉపాధి హామీకి
అనుసంధానం చేయాలని,బట్టయిలో రసాయన ఎరువులు వాడకుండా బయో మందులు వాడే విధంగా చేయాలని, ఉద్యాన శాఖ ద్వారా బత్తాయి పంటలు పండించే రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, బత్తాయి పంటకు మద్దతు ధర కల్పించాలని, నల్గొండలో బత్తాయి ఫెస్టివల్ నిర్వహించాలని, ఇతర ప్రాంతాల మార్కెట్ లతో అనుసంధానం చేయాలని సూచించారు.
వ్యవసాయ శాఖ జె డి బాబు మాట్లాడారు.

అదనపు కలెక్టర్లు జే. శ్రీనివాస్, నారాయణ అమిత్ ,రాష్ట్ర
జిల్లా ఉద్యాన శాఖ ఉపసంచాలకులు సుభాషిని, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, వ్యవసాయ కమిషన్ ఓ ఎస్ డి గోపాల్ ,ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి ,తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.