— రాష్ట్ర అధ్యక్షులు కడారు ప్రభాకర్ రావు
(అక్షర కలం న్యూస్): 13 సెప్టెంబర్: భారతీయ సంస్కృతిని, కళలను ప్రపంచవ్యాప్తంగా. విస్తృత పర్చేందుకు భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కప్) కృషి చేస్తుందని హైకోర్టు న్యాయవాది, ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షులు కడారు ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం నల్గొండ లోని ఐఎంఏ హాల్లో ఇస్కఫ్ నల్గొండ జిల్లా మహాసభలు డాక్టర్ ఏ సి హెచ్ పుల్లారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సైతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకులలో తగిన స్థానం కోరటం సహితమైనది కాదన్నారు. గత 80 సంవత్సరాలుగా ఇస్కాఫ్ దేశ సమైక్యత, సమగ్రత కోసం కృషి చేస్తుందన్నారు. ఇటీవల వెనుజుల అధ్యక్షులు మడురోని అక్రమంగా అమెరికా సైన్యం అరెస్టు చేసి న్యూయార్క్ జైల్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఐ ఏ ఎల్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ ఇరాన్ పై అకారణంగా అమెరికా యుద్ధం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల శాంతి అలీన ఉద్యమ బలోపేతం, పాలస్తీనా, ఇరాక్ సరిహద్దు వివాదాల వంటి వాటిపై ఇస్కాఫ్ పోరాడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు కారింగు బిక్షమయ్య, కరీం, కోశాధికారి అవ్వ విజయలక్ష్మి ,న్యాయవాదులు మునగాల నారాయణరావు, గుండె వెంకటేశ్వర్లు, కట్ట అనంతరెడ్డి, కస్తాల సర్పంచ్ ఎల్. సత్యం, ఐఎంఏ పట్టణ అధ్యక్షులు ఆర్ రమేష్ తదితరులు ప్రసంగించారు. అనంతరం ఇస్కాఫ్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ ఏ సి హెచ్ పుల్లారావు, ప్రధాన కార్యదర్శిగా కస్తాల సర్పంచ్ ఎల్. సత్యం, కోశాధికారిగా బి రామలింగం లతో పాటు 35 మందితో జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.