‘అధికార’ అండదండలు

బతుకమ్మ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంజీర పరీవాహక ప్రాంతం నుంచి రాత్రీపగలు తేడాలేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ డంప్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక మంజీరా పరీవాహక గ్రామానికి చెందిన వ్యక్తి చక్రం తిప్పుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలను చూసుకుని ఆ వ్యక్తి కనుసైగతో రెవెన్యూ, పోలీసు అధికారులను శాసిస్తున్నాడని, వారిని మామూళ్ల మత్తులో ముంచెత్తుతున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులు ప్రశ్నిస్తే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవల్సిందేనని అంటున్నారు. అధికారంలో ఉన్న కొందరు నాయకుల అండదండలతో ఇసుక ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని పట్టపగలే ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరని, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని, మరి కొన్నిచోట్ల అధికారులే అందినకాడికి దండుకుని ఇసుక ట్రాక్టర్లను వదిలేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమరవాణాను అడ్డుకుని సహజ సంపదను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.