అక్షర కలం/ ఖమ్మం ప్రతినిధి:
*నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు*
**విలీన గ్రామాల మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత*
**మహిళల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు*
**200 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు*
**ఖమ్మం ఖిల్లా రోప్ వే పనులను త్వరలో ప్రారంభిస్తాం*
**ఖమ్మం నగరంలో పర్యటించి 3వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి తుమ్మల*
ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
మంత్రివర్యులు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి శనివారం ఖమ్మం నగరంలో పర్యటించి 3వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.
ఖమ్మం నగర పాలక సంస్థ 3వ డివిజన్ నందు ఎల్.ఆర్.ఎస్. నిధులు 50 లక్షలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు, 50 లక్షల టి.యూ.ఎఫ్.ఐ.డి.సి. నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, ఈనాడు బైపాస్ రోడ్డు నుంచి బల్లెపల్లి వరకు కోటి 80 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, బల్లేపల్లి ఎస్సీ కాలనీలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
*ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* తన ఆప్త మిత్రుడు జగన్ లేకుండా డివిజన్ 3 లో సమావేశం ఏర్పాటు చేయడం బాధాకరంగా ఉందని అన్నారు. జగన్ ఆశయాలను తన పదవి కాలంలో తప్పనిసరిగా పూర్తి చేస్తానని, ప్రజల సౌకర్యార్థం జగన్ కు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తానని మంత్రి అన్నారు.
డివిజన్ 3 కు సంబంధించి ప్రతి పని చేస్తామని అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో విలీన గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం, డ్రైయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించి ఇప్పటివరకు 200 కోట్లరూపాయల విలువ గల పనులు మంజూరు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి వద్ద మరో 150 కోట్లు ఖమ్మం కార్పొరేషన్ కు మంజూరు చేయవలసిందిగా ప్రతిపాదనలు పంపానని, ఆగస్టు 15 నాటికి కనీసం మరో 100 కోట్లు మన నగరానికి ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు.
ఖమ్మం నగరంలో 280 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, 160 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, 30 కోట్లతో ఖమ్మం ఖిల్లా రోప్ వే పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఖమ్మం నగరంలో భూ గర్భ డ్రైనేజీ కోసం 200 కోట్ల మంజూరు చేశామని, నగరంలో మరో 220 కోట్లు అమృత్ నిధులు తీసుకొని వచ్చి త్రాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, విలీన గ్రామంలో మౌళిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు.
మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని, మహిళలు 200 కోట్ల ప్రయాణాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పూర్తి చేసుకున్నారని, మహిళలు నెలకు సరాసరి 3 వేల రూపాయలు ఆదా చేస్తున్నారని, ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు 6700 కోట్ల రూపాయలు చెల్లించిందని అన్నారు.
విద్యార్థులకు, యువకులకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు చేపట్టామని, గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీ భారం కూడా అధికంగా ఉందని అన్నారు. రైతులకు సన్న రకం ధాన్యంపై క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో కూడా సన్నబియ్యం పెడుతున్నామని అన్నారు. పాఠశాలలను మహిళా సంఘాల ద్వారా బాగు చేస్తున్నామని, పిల్లల ఏకరూప దుస్తులు మహిళా సంఘాల ద్వారా కుట్టించడం జరిగిందని అన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, పెట్రోల్ బంక్ వంటి అనుకూలంగా ఉన్న ప్రతి రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
**ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ* 3వ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నగరంలో అన్ని సౌకర్యాలతో 3వ డివిజన్ ను ఆదర్శవంతంగా తయారు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.
**ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ* 3వ డివిజన్ లో సీసీ రోడ్డు , డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. నగరంలో రోడ్లు, ఫుట్ పాత్, పార్కు, డ్రైయిన్ వంటి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. విలీన గ్రామాల్లో అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి క్రొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ అనిల్, ఏసీపీ వసుంధర, విద్యుత్ శాఖ డిఇ రామారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.